logo

రాతలు మారుస్తూ.. హద్దులు చెరిపేస్తూ

నద్దినాలాను ఆనుకుని దాదాపుగా 16.04 ఎకరాల్లో ఉన్న ఓ ప్రభుత్వ భూమి సర్వే నంబరు కాలక్రమంగా తనరూపును కోల్పోయింది. ఎక్కడికక్కడే ఈ భూమిని ఇళ్ల స్థలాల పేరిట అందినకాడికి కబ్జా చేయడంతో అసలు అది సర్కారీ స్థలం

Published : 21 Jan 2022 03:18 IST

 ఏళ్ల తరబడి రేకుర్తిలో భూనాటకం

 విలువైన స్థలాలపై రెవె‘న్యూ’ లీల.!

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

సర్కారీ స్థలంలో ఆక్రమణల ప్రయత్నాలు..

నద్దినాలాను ఆనుకుని దాదాపుగా 16.04 ఎకరాల్లో ఉన్న ఓ ప్రభుత్వ భూమి సర్వే నంబరు కాలక్రమంగా తనరూపును కోల్పోయింది. ఎక్కడికక్కడే ఈ భూమిని ఇళ్ల స్థలాల పేరిట అందినకాడికి కబ్జా చేయడంతో అసలు అది సర్కారీ స్థలం (పరంబోవు) అనే విషయాన్నే పలువురు మరిచిపోయారు. అప్పట్లో కొందరి అండతో ఈ భూమికి సంబంధించిన రికార్డులు మారిపోయాయి. ఒకప్పుడు నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ స్థలం వివరాలు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్‌సైట్‌లో బైనంబర్లతో దర్శనమిస్తున్నాయి. ఇళ్ల స్థలాలతోపాటు పలువురి పేరిట పట్టా ఉన్నట్లు అధికారిక దస్త్రాల్లో ఈ భూమి తలరాత మారిపోయింది. అప్పట్లో 16.04 ఎకరాలుగా ఉన్న సర్కారీ జాగ పరిధిలో 27 బైనంబర్లు పుట్టుకొచ్చాయి. ఇక విస్తీర్ణం పరంగానూ ఇది 14.06 ఎకరాలకు కుచించుకుపోయింది.

రేకుర్తికి సంబంధించి కొన్ని సర్వే నంబర్ల భూముల్ని రిజిస్ట్రేషన్లు చేయొద్దని వాటిని నిషేధిత జాబితాలో పెట్టారు. ఇందుకోసం సంబంధిత గంగాధరలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వాటి సంఖ్యల్ని పంపించారు. అయినా గడిచిన దశాబ్ద కాలంగా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు మాత్రం ఠంచనుగా జరిగిపోతున్నాయి. కొన్ని ప్రభుత్వ సర్వే నంబర్ల స్థానంలో ఇంటి సంఖ్యలను కేటాయిస్తూ యథేచ్ఛగా పట్టా భూములుగా ఇవి పలువురి వశమవుతున్నాయి. ఇలా విలువైన జాగల్ని పరులకు చెందే విషయంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులతోపాటు స్థానిక నాయకులు చక్రం తిప్పారనే చర్చ బహిరంగంగానే వినిపిస్తోంది. పైగా ఎకరం, అరెకరం ఉన్న చిన్నపాటి స్థలాలు ఎప్పుడో కబ్జా కోరల్లోకి చేరిపోయాయి. చాలా సర్వే నంబర్లు ఇలాంటి కోవలోనే పట్టాలుగా మారి ఇతరుల పరమయ్యాయి.

రాజకీయం.. అధికారులు చేతులు కలిపితే ఎంచక్కా భూమాయలకు తెర తీయొచ్చనేందుకు రేకుర్తి ఆక్రమణలే సరైన ఉదాహరణలు. పదుల సంఖ్యలోని కోట్లాది రూపాయల విలువైన భూములు ఇక్కడ నామరూపాలు లేకుండా పోయాయి. అభివృద్ధి చెందుతున్న ప్రాంతమవడంతో కొన్నేళ్ల నుంచే ఇక్కడ ఆక్రమణల పర్వానికి తెరతీశారు. పంచాయతీగా ఉన్నప్పటి నుంచే విలువైన భూములనే అన్యాక్రాంతం చేసే క్రతువు ప్రారంభమవగా ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగంలోని కొందరు ఈ భూనాటకంలో కీలక పాత్రదారులు, సూత్రదారులుగా మారారనేది చర్చ జరుగుతోంది. గతంలో ఏళ్లతరబడి ఇక్కడి సేవల్లో తరించిన వారిలో ఒకరిద్దరు కబ్జాదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి హద్దులను నిర్ణయించేలా ఉన్న పెద్దనైన రాతి కడీలు చాలాచోట్ల తీసేశారు. ఇదే అదనుగా ఆ స్థలాల్లో పలువురు పాగా వేసేశారు.

కన్నేసిన చోటుపై...

ప్రభుత్వ భూములెక్కడ ఉన్నా  కబ్జా చేయాలనే విషయమై ఏళ్ల తరబడి ఇక్కడ పలువురు పోటీపడ్డారు. రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది సంపూర్ణ సహకారాన్ని అందించడంతో ఎంచక్కా రికార్డుల్లో పేర్లను మార్చడంతో పాటు మెల్లిమెల్లిగా సరిహద్దుల్ని చెరిపేసేలా ఆక్రమణలు పెంచారు. అప్పట్లో ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో ఇష్టానుసారంగా రికార్డుల్లో రాతలు మారాయనే అభియోగాలున్నాయి. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా.. క్షేత్రస్థాయిలో సరైన విచారణలు, పర్యవేక్షణలు లేకపోవడంతో విలువైన జాగలన్నీ ఆగమయ్యాయి. రేకుర్తికి సంబంధించిన పలువురు 1997 నుంచి భూములను కాపాడాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కొందరు లోకాయుక్తను ఆశ్రయించారు. అయినా సరిగ్గా నివేదికలు రూపొందించకపోవడం, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో ఇక్కడి స్థలాలకు రక్షణ కరవైంది. ఇటీవల చేపట్టిన భూ ప్రక్షాళన సమయంలో ఒకరిద్దరు రెవెన్యూ సిబ్బంది భూమార్పిడి విషయంలో చూపించిన లీలలతోనే గత తాలుకూ అక్రమాలన్నీ రికార్డుల పరంగా సక్రమమయ్యాయని తెలుస్తోంది. గతంలో ఉన్న భూముల దస్త్రాలు చాలా వరకు మాయమవడంతో కొన్నింటి విషయంలో ఇప్పటికీ ఇబ్బంది ఎదురవుతోంది.


ఆక్రమణల్ని గుర్తించిన అధికారులు

నాలాను పరిశీలిస్తున్న ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ ఇతర అధికారులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ : రేకుర్తిలో భూ ఆక్రమణల తీరుపై వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 20వ తేదీన ‘నద్దినాలా.. కబ్జా గోల’ శీర్షికన వచ్చిన కథనానికి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయికి వెళ్లారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్‌తోపాటు నీటిపారుదల శాఖ ఈఈ నాగభూషణరావులు తమ బృందంతో నద్దినాలా చెంతన జరుగుతున్న ఆక్రమణల తీరుని గమనించారు. వంతెన నుంచి రైల్వే కట్ట వరకు పలు ప్రాంతాలను పరిశీలించారు. కొన్ని చోట్ల  ఆక్రమణల్ని గుర్తించినట్లు వారు తెలిపారు. త్వరలోనే సర్వే బృందంతో హద్దులను నిర్ణయించి ఆక్రమిత స్థలాల్ని తిరిగి స్వాధీన పర్చుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఆర్డీవో, ఈఈలతోపాటు నీటిపారుదల శాఖ డీఈ సురేశ్‌, కొత్తపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని