logo

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు

కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మండంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో

Published : 21 Jan 2022 03:18 IST

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కరపత్రాలను ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌ రావు, ఆలయ అధికారులు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మండంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో సమావేశంలో బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ పంచమ పవిత్ర బ్రహ్మోత్సవాలు గతంలో కంటే ఉన్నతంగా నిర్వహించుకునేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి పండితుల సూచన మేరకు కల్యాణ వేదికను అమర వీరుల స్తూపం వరకు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  తిరుమలకు చెందిన పండితులతో కలిసి వేదిక.అధ్యయనోత్సవాలు, తదితర ఏర్పాట్లపై చర్చించారు. తిరుమల తిరుపతికి చెందిన వేద పండితులతో కలిసి ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 4, 5, 6 తేదీల్లో స్వామి వారి అధ్యయనోత్సవాలు, 7 నుంచి బ్రహ్మోత్సవాలు ఉంటాయని తెలిపారు. జిల్లా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ వారు అన్నదానం బియ్యం, కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ వారు కిరాణ సామగ్రి సమకూర్చేందుకు ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటి మేయర్‌ చల్లా స్వరూపరాణి హరిశంకర్‌, వంశీయ ధర్మకర్తలు చకిలం గంగాధర్‌, చకిలం శ్రీనివాస్‌, ఈవో పీచర కిషన్‌రావు, పాలక వర్గ సభ్యులు గంప రమేష్‌, గోగుల ప్రసాద్‌, కార్పొరేటర్లు, గోవిందపతి సేవా సమితి అధ్యక్షుడు పాలవేడు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

నగరపాలిక ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో అతిపెద్ద పండుగైన సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం నగరపాలిక మొదటిసారి నిధులు కేటాయించిందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం నగరంలోని రేకుర్తికాలనీలో రూ.1.30కోట్లతో జాతర ప్రాంగణంలో జరిగే అభివృద్ధి పనులను నగర మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడికి 3.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. 18, 19 డివిజన్ల కార్పొరేటర్లు సుధగోని మాధవి, ఏదుల్లా రాజశేఖర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్రరాజు, ఆలయ ఛైర్మన్‌ పిట్టల శ్రీనివాస్‌, ఎస్‌ఈ నాగమల్లేశ్వరరావు, డీఈఈ మసూద్‌అలీ, ఏఈలు గంగాధర్‌, గఫూర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని