logo

తోబుట్టువులే మోసం చేశారని ఆత్మహత్య

సోదరుడు, సోదరి మోసం చేసిన తీరును వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ

Published : 21 Jan 2022 03:18 IST

ఆస్తి వివాదంపై సెల్పీ వీడియోలో వెల్లడి

సెల్ఫీ వీడియోలో వివరాలు వెల్లడిస్తున్న శ్రీనివాస్‌

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : సోదరుడు, సోదరి మోసం చేసిన తీరును వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. నగరంలోని తిరుమల్‌నగర్‌కు చెందిన తిప్పారపు శ్రీనివాస్‌ (42) గాయిత్రీనగర్‌లో వెల్డింగ్‌ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శ్రీనివాస్‌ తన సోదరుడు ఆంజనేయులుతో కలిసి పొత్తులో 15 ఏళ్ల కిందట గోదాంగడ్డ వద్ద రెండున్నర గుంటల స్థలంలో రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. కింద భాగంలో శ్రీనివాస్‌ ఉంటుండగా, ఆంజనేయులు మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పొత్తులో కట్టుకున్న ఇంటిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆంజనేయులు వేధిస్తుండేవాడు. దీంతో రెండేళ్ల క్రితం గోదాంగడ్డలోని సొంత ఇంటిని వదిలి తిరమల్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి విషయంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా ఆంజనేయులు సొంత ఇంట్లోకి రానివ్వలేదు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌లో సోదరుడు ఆంజనేయులు, సోదరి మదుపు లక్ష్మి, శ్రీనివాస్‌ పొత్తు కింద రూ.3 లక్షలు ఇచ్చి కొంత భూమిని కొనుగోలు చేశాడు. శ్రీనివాస్‌కు సంబంధం లేకుండానే లక్ష్మీ, ఆంజనేయులు వారి పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ సోదరి, సోదరున్ని నిలదీయగా వారు ఇబ్బందులకు గురిచేశారు. భూమి కొనుగోలు సమయంలో పెట్టుబడిగా పెట్టిన రూ.3 లక్షలు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. వారం రోజుల కింద శ్రీనివాస్‌ సోదరుడు, సోదరిని డబ్బులు, ఇంటి విషయంలో నిలదీయగా చావమంటూ వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన శ్రీనివాస్‌ 19న మధ్యాహ్నం వెల్డింగ్‌ దుకాణానికి పోతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం భార్య స్వరూప శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో వెంటనే కుమారున్ని దుకాణం వద్దకు పంపించగా శ్రీనివాస్‌ పురుగు మందు తాగి కింద పడిపోయాడు. స్థానికులతో కలిసి చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. తన సోదరుడు ఆంజనేయులు, సోదరి లక్ష్మీ తనను మోసం చేశారని పేర్కొంటూ శ్రీనివాస్‌ తన బాధŸను సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. తన భర్త మృతికి కారణమైన ఆంజనేయులు, లక్ష్మీలపై చర్యలు తీసుకోవాలని మృతుడు శ్రీనివాస్‌ భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని