logo

సర్కారీ ఆస్తి.. సర్వం స్వాహా!

సర్కారీ ఆస్తులకు పుట్టిళ్లుగా పిలిచే రేకుర్తి గ్రామంలో నాలుగు దశాబ్దాల కిందటి వరకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కదులుతున్న కాలంతోపాటు అది కరిగిపోయి వచ్చింది. ప్రస్తుతం కేవలం దస్త్రాల్లో మాత్రమే 86.23 ఎకరాల

Published : 22 Jan 2022 02:22 IST

రక్షణ లేక రేకుర్తి భూముల భక్షణ

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

పడకేసిన టాస్క్‌ఫోర్స్‌ నిఘా పర్యవేక్షణ

ఇలాంటి సరిహద్దు రాళ్లు మాయమయ్యాయ్చి

సర్కారీ ఆస్తులకు పుట్టిళ్లుగా పిలిచే రేకుర్తి గ్రామంలో నాలుగు దశాబ్దాల కిందటి వరకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కదులుతున్న కాలంతోపాటు అది కరిగిపోయి వచ్చింది. ప్రస్తుతం కేవలం దస్త్రాల్లో మాత్రమే 86.23 ఎకరాల భూమి ఉన్నట్లుంది. ఇందులోనూ వాస్తవంగా చాలావరకు కబ్జాకు గురైంది. గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో ఇక్కడి భూమిపై ఇష్టానుసారమనే తీరు కనిపించింది. అందినకాడికి కొందరు వీటిని ఇతరులకు అప్పజెప్పేశారు. ఇలా నాలుగేళ్ల కిందటి వరకు 108.04 ఎకరాలున్నది కాస్తా ఇప్పటి రికార్డులతో పోలిస్తే 22 ఎకరాల వరకు తగ్గిపోయింది. ఇలాగే ఉదాసీనంగా ఉంటే ఉన్న భూమి కూడా మాయమవనుంది. చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకున్న చందంగా ఇప్పుడున్న అవసరాలకు తగినట్లుగా వివిధ ప్రభుత్వ భవనాలు, సామాజిక అవసరాలకు ఇక్కడి భూమి కావాల్సి వస్తుండటంతో ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ముందునుంచే ఉన్న భూముల్ని కాపాడుకుంటే భవిష్యత్తు రూపంలో భూముల బెంగ ఉండేది కాదని పలువురు వాపోతున్నారు. ఉన్నవాటిపై ఉదాసీనత చూపడం వల్లనే ఈ దుస్థితి ఎదురైందనే వ్యథ ఇక్కడి ప్రజలనుంచి వినిపిస్తోంది.

నిధిని వెచ్చించి ఉంటే..!

ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం అందించే భూముల రక్షణ నిధిని కొన్నేళ్లకిందటనే వెచ్చించి ఉంటే వీటి జాడలు మరో రకంగా ఉండేది. 2014-15వ సంవత్సరంలో ఆయా తహసీల్దార్‌ల పర్యవేక్షణలో మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్ని గుర్తించి వీటిని కాపాడేందుకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందించింది. దీని ద్వారా చాలా మండలాల్లో రాతి కడీలను, అడ్డు తీగలను ఏర్పాటు చేయడంతోపాటు నీలి రంగుతో కూడిన పెద్ద గద్దెలను సరిహద్దులుగా నిర్మించారు. భూవివరాలతో కూడిన పెద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ రేకుర్తికి వచ్చే సరికి ఇలాంటి చర్యల విషయంలో యంత్రాంగం చొరవ చూపించలేదు. మరోవైపు జిల్లా స్థాయిలో రెవెన్యూ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని కొన్నేళ్ల కిందటే ఏర్పాటు చేశారు. తరువాత జిల్లాలో ఆ బృందం పనిచేస్తుందనే ఆనవాళ్లు కూడా లేకుండా పరిస్థితుల్ని మార్చారు. దీంతో ఎక్కడిక్కడ సర్కారీ ఆస్తి మాయమవుతూ వచ్చింది. మరోవైపు రెండేళ్ల కిందట చేపట్టిన సమగ్ర భూముల సర్వే సమయంలోనూ ప్రభుత్వ జాగల విషయంలో గోల్‌మాల్‌ వ్యవహారమే ఇక్కడ నడిచింది. అప్పుడు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం-2018 అమలులోనూ లోపాలు కనిపించాయి. ఇప్పుడు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంతోపాటు పురపాలిక చట్టం ప్రకారం ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యల్ని తీసుకోవాల్సిన అవసరముంది.

శిఖం భూముల్లోనూ దగా..!

ఇక్కడి సాగునీటి వనరుల సంరక్షణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఒకప్పుడు పదుల సంఖ్యలో రేకుర్తిలో ఉన్న చెరువులు, కుంటలు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఇందులో కొన్ని ఇనాం పట్టాకు చెందినవి ఉండటంతో కాలక్రమంగా రూపుని కోల్పోయాయి. ప్రస్తుతం అధికారిక వివరాల ప్రకారం రెండు శిఖం చెరువులు (ఇనాంపట్టా) 17.30 ఎకరాల్లో ఉన్నాయి. ఇవి పోనూ ఎక్కడ వెతికినా.. ఇతర చిన్ననీటి వనరుల జాడే కనిపించదు. పైగా నీటి పారుదల చెరువులకు, ఎస్సారెస్పీ కాలువలకు అనుబంధంగా ఉన్న చిన్న కాలువలన్నీ 26 రకాల సర్వేనెంబర్లలో ఉన్నాయి. వీటన్నింటి విస్తీర్ణం ధరణి వెబ్‌సైట్‌ ప్రకారం 12.06 ఎకరాలుగా ఉంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా చోట్ల అసలు స్వరూపాన్నివి కోల్పోతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ స్థలాలపై నిఘా కొరవడటంతో ఇబ్బంది పెరుగుతోంది. పూర్వకాలం నుంచి ఇక్కడి ప్రజల నోళ్లల్లో నానిన ఏడెనిమిది కుంటల జాడలు ఇప్పుడు ఎంత వెతికినా దొరకడం కష్టమే.! చిన్నకుంటలన్నీ ఆక్రమణల జాబితాలోకి చేరిపోయాయి.

ఇదీ.. రేకుర్తిలో ఇళ్లమధ్యన ఉన్న ప్రభుత్వ స్థలం. దాదాపుగా అరగుంట విస్తీర్ణముంది. ఏదో కాపాడాలనేలా రెవెన్యూ అధికారులు ఇలా నామమాత్రపు సూచికను ఏర్పాటు చేశారు. వాస్తవానికి బోర్డు చెంతన అసలు ఈ ప్రభుత్వ భూమి వివరాల్ని క్లుప్తంగా ప్రజల సౌకర్యార్ధం పొందుపర్చాలి. సర్వే నంబరుతోపాటు విస్తీర్ణాన్ని పక్కాగా పేర్కొనాలి. అలా హెచ్చరికతో కూడిన సమాచారం అందరికి తెలిసినట్లైతే వాటి సంరక్షణకు పరోక్ష సహకారం అందుతుంది. వందల ఎకరాలున్న రేకుర్తిలో కేవలం రెండంటే రెండు చోట్లనే ఇలా సర్కారు స్థలమిదనే గుర్తింపును రెవెన్యూ అధికారులు పెట్టారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనమైన ఈ రేకుర్తిలో 60 ఏళ్లపైబడిన వారికి మాత్రమే కాస్తో.. కూస్తో ఇక్కడున్న జాగల గురించి తెలుసు. కొన్నేళ్లుగా వీటి పరిరక్షణకు యంత్రాంగం నడుం బిగించకపోవడం వల్లనే వీటిని భూతద్దంతో వెతకాల్సిన దుస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని