logo

పేదల సంతోషమే లక్ష్యం

పేద ప్రజలు సంతోషంగా ఉండటమే తమకు కావాల్సిందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు

Updated : 22 Jan 2022 05:31 IST

బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

పొక్లెయిన్‌ అందజేస్తున్న మంత్రి గంగుల, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే రవిశంకర్‌, తదితరులు

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: పేద ప్రజలు సంతోషంగా ఉండటమే తమకు కావాల్సిందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో గ్రూపుగా ఎంపిక చేసుకున్న వారికి వాహనాలు అందజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ.. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రారంభించారని చెప్పారు. 24 మంది లబ్ధిదారులకు 10 యూనిట్లుగా రూ.2.60 కోట్ల విలువ చేసే ఆరు హార్వెస్టర్లు, ఒక్క డీసీఎం వ్యాను, మూడు జేసీబీలను అందించినట్లు తెలిపారు. నాడు డ్రైవర్‌గా పనిచేసిన వారు నేడు ఓనర్‌గా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి,  ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, సుడా ఛైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, గ్రంథాలయ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

మార్చి 31లోగా మొదటి దశ..

కరీంనగర్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎంపిక చేసి మార్చి 31లోగా మొదటి దశ దళితబంధును పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అర్హులైన 17,556 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 1500 మంది డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకోగా వారికి షెడ్ల నిర్మాణం కోసం రూ.1.50లక్షలు అందించినట్లు చెప్పారు. 6,800 మంది రవాణా వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా వారందరికి లైసెన్సులు ఇప్పించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌ మాట్లాడుతూ.. అర్హులైనా ప్రతి ఒక్కరికి దళితబంధు పథకం అమలవుతుందన్నారు. సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా ఛైర్మన్‌ జీ.వీ.రామకృష్ణారావు, జిల్లా అదనపు పాలనాధికారులు గరిమఅగ్రవాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవ ఇస్లావత్‌ పాల్గొన్నారు.


మేం ముగ్గురం యజమానులం  

సరమ్మ, వెంకట్రావ్‌పల్లి, హుజురాబాద్‌ మండలం

మాకు ఉన్న రెండెకరాలతో పాటు ఇతరుల భూమి కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం. మా పెద్దకొడుకు జేసీబీ కిరాయికి తీసుకువచ్చి నడిపించాడు. ఇప్పుడు దళితబంధు పథకంలో ఇంటికి రూ.పది లక్షలు ఇవ్వడంతో మేమే ముగ్గురం కలిసి రూ.30లక్షలతో జేసీబీ తీసుకున్నాం.


20ఏళ్లు డ్రైవర్‌గా పనిచేశాను

మా ఊరికి సమీపంలో జమ్మికుంట మార్కెట్‌ ఉంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని గ్రామాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు డీసీఎంపై డ్రైవర్‌గా 20 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు దళితబంధు మా పాలిట వరం అయింది. నేను మా బావమరిది కలిసి రెండు యూనిట్లుగా రూ.20లక్షలతో డీసీఎం వ్యాన్‌ తీసుకున్నాం. నాకు డ్రైవింగ్‌లో అనుభవంతో పాటు వ్యాపారం తెలుసు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని