logo

సంపూర్ణ పారిశుద్ధ్యం.. ప్రజారోగ్యమే లక్ష్యం

గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిధులు మంజూరు చేస్తూ స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటిస్తూ పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రోత్సహిస్తోంది.

Published : 22 Jan 2022 02:22 IST

26 గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందం

మెట్‌పల్లి, న్యూస్‌టుడే

వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం ప్రతినిధి

గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిధులు మంజూరు చేస్తూ స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటిస్తూ పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రోత్సహిస్తోంది. ఏటా ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీలకు నగదు పురస్కారాలు అందజేస్తోంది.

పంచాయతీ నిధులతోపాటు జాతీయ ఉపాధిహామీ పథకం అనుసంధానంతో చెత్త నిల్వల కేంద్రాలు, డంపింగ్‌ యార్డులు, తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వృథా నీరు భూమలోకి ఇంకించేలా ఇంటింటికీ ఇంకుడుగుంతలు తవ్విస్తున్నారు. మూడేళ్ల కిందట వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణమైన జిల్లాగా జగిత్యాల గుర్తింపు పొందింది. గత ఏడేళ్లలో 380 పంచాయతీల్లో వివిధ పథకాల కింద 70,221 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లాలో పలు పంచాయతీలు స్వచ్ఛ గ్రామాలుగా గుర్తింపు పొంది ఆదర్శంగా నిలిచాయి. కొన్ని గ్రామాల్లో మూత్ర విసర్జన బహరంగాగానే చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తగా నిర్మాణంలో ఉన్న 4వేల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటించి గ్రామాల్లో వివిధ అంశాలను పరిశీలించారు.

వివరాల సేకరణ ఇలా..

జిల్లాలో 18 మండలాల్లో 380 పంచాయతీలు ఉండగా కేంద్రం ప్రతినిధులు 15 మండలాల్లో ఎంపిక చేసిన 26 గ్రామాల్లో పర్యటించి ప్రతి గ్రామంలో పది ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయా ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా? వాటిని వినియోగిస్తున్నారా? గ్రామంలో బహిరంగ మల విసర్జన చేస్తున్నారా? గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా, చెత్త సేకరణ ఎలా ఉంది? చెత్త ట్రాక్టర్‌ ప్రతి రోజు ఇంటికి వస్తూందా? తడి, పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారా? కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డు ఉందా? ఎరువును తయారు చేస్తున్నారా? ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారా? సర్పంచి, కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటున్నారా? తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

ప్రజల భాగస్వామ్యంతో.. -శ్రీనివాస్‌, సర్పంచి, ఆత్మనగర్‌ గ్రామం

గ్రామ అభివృద్ధి, సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మెరుగుపడింది. వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచాం. డంపింగ్‌ యార్డుకు తడి, పొడి చెత్తను తరిలిస్తున్నాం. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

ఈ ఫొటోలో ఉంది మెట్పల్లి మండలంలోని ఆత్మనగర్‌ గ్రామం. ఇది పునరావాస గ్రామం. ఇక్కడ 520 గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా గుర్తింపు పొందింది. సర్పంచి శ్రీనివాస్‌ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల హైదారాబాద్‌లోని ఎన్‌ఐఆర్డీలో జరిగిన యూనిసెఫ్‌ 6వ నీటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత సమావేశంలో గ్రామంలో స్వచ్ఛత, సుస్థిర పారిశద్ధ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న సర్పంచి శ్రీనివాస్‌ యూనిసెఫ్‌ ప్రతినిధుల ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని