logo

పకడ్బందీగా ఇంటింటి సర్వే

జిల్లాలో జ్వరాలపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని

Published : 22 Jan 2022 02:22 IST

జగిత్యాల, న్యూస్‌టుడే

జిల్లాలో జ్వరాలపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గుగులోతు రవి చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రజలు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జ్వరాలపై సర్వే, ఆస్పత్రుల్లో సదుపాయాలపై శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.

* జిల్లాలో జ్వరాలపై పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 2.63 లక్షల నివాసాలుండగా 713 బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఆశా, అంగన్‌వాడీ, పట్టణాల్లో రిసోర్స్‌పర్సన్‌, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. తొలిరోజు 5298 నివాసాల్లో సర్వే చేయగా 1505 మంది జ్వరాలతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అయిదు రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం.

* జిల్లాలో ఇది వరకే నాలుగు విడతల్లో జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించాం. తొలివిడత 7314 మంది రెండో విడత 3696, మూడోవిడత 1619, నాల్గో విడత 1436 మందికి జ్వరాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం మేరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నప్పటికి వ్యాధుల తీవ్రతను బట్టి నిరంతరం కొనసాగిస్తాం.

* జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంటింటి సర్వేలో జ్వరాలు తేలిన వారికి వెంటనే ఏడు రకాల గోలిలతో మందుల కిట్‌ ఇస్తున్నాం. కిట్లకు కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 40 వేల కిట్లు అందుబాటులో ఉండగా శుక్రవారం మరో 10 వేలు వచ్చాయి.

* జిల్లాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తున్నాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 20 వెంటిలేటర్లు ఉన్నాయి. మెట్‌పల్లి ఆస్పత్రిలో రెండు ఏర్పాటు చేస్తాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటైంది. ధర్మపురి, కోరుట్ల ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తాం. జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిమీటర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

* జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం. ప్రతిరోజూ 4 వేలకు తగ్గకుండా పరీక్షలు చేయాలని ఆదేశించాం. పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో టీకా ఇచ్చే బృందాలకు కరోనా టెస్టింగ్‌ కిట్లు ఇచ్చాం. ఎవరైనా ఆస్పత్రులకు రాని వారికి ఇంటి వద్దే పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేశాం.

* జిల్లాలో కొవిడ్‌ టీకా కార్యక్రమంలో వేగం పెంచాం మొదటి డోసు వందశాతం పూర్తయ్యింది. రెండోడోసు 77 శాతం పూర్తికాగా టీనేజర్లతో పాటు అర్హులైన వారికి బూస్టర్‌డోసు ఇస్తున్నాం. ప్రాణరక్షణకు టీకా తప్పనిసరని ప్రజలు గుర్తించాలి. కొవిడ్‌ నిబంధనలు సైతం కచ్చితంగా పాటించాలి. ఈ విషయమై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే పాటించని వారికి జరిమానా విధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని