logo

నాటుకుపోయిన మూఢ నమ్మకం

సాంకేతిక యుగంలోనూ ఆ గ్రామంలో మూఢ నమ్మకం బలంగా నాటుకుపోయింది. జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో గురువారం మంత్రాల నెపంతో నాగేశ్వర్‌రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ హత్య

Published : 22 Jan 2022 02:22 IST

ఎవరిని కదలించినా మంత్రాలే

పోలీసులకు వివరిస్తున్న కాలనీ మహిళలు

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: సాంకేతిక యుగంలోనూ ఆ గ్రామంలో మూఢ నమ్మకం బలంగా నాటుకుపోయింది. జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో గురువారం మంత్రాల నెపంతో నాగేశ్వర్‌రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గ్రామంలో మూఢ నమ్మకంపై పలు కుటుంబాలను ‘న్యూస్‌టుడే’ పలకరించింది. టీఆర్‌నగర్‌లో దాదాపు 10 వేల మంది నివసిస్తున్నారు. చాలా మంది నిరక్షరాస్యులు, రోజు కూలీ పని చేయటం, ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందనే అనుమానం బాగా పెరిగిపోయింది. తమ భర్త చనిపోవటానికి మంత్రాలే కారణమని ఒకరు కన్నీళ్ల పర్యంతమైతే.. మరో మహిళ తమ కొడుకు కాళ్లు పడిపోవటానికి చేతబతే కారణమని.. నిత్యం అనారోగ్యానికి గురవుతున్నానని.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా రోగం నయం కావటంలేదని మరో మహిళ పేర్కొంది. గ్రామంలో ఎరుకల కాలనీలో దాదాపు 50 కుటుంబాల్లో ఒకటే మాట వినిపించింది. ఈ అనుమానాలే గురువారం మూడు హత్యలకు కారణమని మహిళలు బహిరంగంగా పేర్కొనటాన్ని చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే మూడు హత్యలు చేశామని..మిగతా వారిని కూడా హత మారుస్తామని పోలీసుల ముందే హెచ్చరించటం చూస్తే వారిలో బలంగా మూఢ నమ్మకం నాటుకుపోవటం కారణమని పోలీసులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వారిలో భయం నెలకొందని దాన్ని పోగొట్టేలా చూస్తామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు.

మూఢ నమ్మకాలను నమ్మరాదు : మూఢ నమ్మకాలను నమ్మరాదని, క్షుద్ర పూజలు, మంత్రాల నెపంతో టీఆర్‌నగర్‌లో ముగ్గురి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తులసి ఆగమయ్య, పాత శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాలలో మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక యుగంలో క్షుద్ర పూజలు, మాయలు, మంత్రాలు, చేతబడి నమ్మి కృరంగా చంపటం హేయమైన చర్య అన్నారు. స్వాములు, బాబాలు, మంత్రగాళ్లు సామాన్య, పేదల ప్రజల బలహీనతలతో తప్పుదోవ పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని