logo

మాతాశిశువులకు అభయం

నవమాసాలు మోసి బిడ్డను కని తల్లి తనివితీరా మురిసిపోతుంది.. మరి తీరా నెలలు నిండాక ప్రమాదకర రోగాలు ఉంటే ఆ తల్లి బాధ చెప్పనలివికాదు.. అలాంటి వారికి గుండె ధైర్యం చెబుతూ.. మేమున్నామంటూ

Updated : 22 Jan 2022 04:38 IST

కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాల్చు

ఆదర్శంగా నిలుస్తున్న ఆసుపత్రులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ వైద్య విభాగం

- గోదావరిఖని పట్టణం

ఖనిలో కరోనా సోకిన మహిళకు జన్మించిన బిడ్డతో స్టాఫ్‌ నర్సులు

నవమాసాలు మోసి బిడ్డను కని తల్లి తనివితీరా మురిసిపోతుంది.. మరి తీరా నెలలు నిండాక ప్రమాదకర రోగాలు ఉంటే ఆ తల్లి బాధ చెప్పనలివికాదు.. అలాంటి వారికి గుండె ధైర్యం చెబుతూ.. మేమున్నామంటూ భరోసానిస్తూ ప్రసవం చేసి తల్లీబిడ్డలను రక్షిస్తున్నారు. ఆపత్కాలంలో పురుడు పోస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.. వారి ప్రాణాలను లెక్క చేయకుండా విధి నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయం.. కరోనా, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి వంటి వ్యాధుల బారిన గర్భిణులకు కరీంనగర్‌ మాతా శిశు కేంద్రం, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రైవేటులో రూ.లక్షల్లో డబ్బులు కుమ్మరించినా అందని వైద్యం ఇక్కడ అందుతోంది. వారి సేవలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనమిది..

మాతాశిశు కేంద్రంలో..

ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న 150 పడకల మాతాశిశు కేంద్రంలో ప్రతినెలా దాదాపు వెయ్యి ప్రసవాలు చేస్తుంటారు.జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో పలు వ్యాధుల బారిన పడిన గర్భిణులను ఇక్కడికే పంపిస్తుంటారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది ప్రత్యేకంగా సేవలందిస్తూ ప్రసవం చేస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులను మొదట్లో హైదరాబాద్‌కు పంపించేవారు. గత ఏప్రిల్‌ 21 నుంచి కరీంనగర్‌లోనే ప్రసవాలు చేసే సౌకర్యం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 174 మంది గర్భిణులు ఆసుపత్రిలో పేర్లు నమోదు చేసుకోగా 103 మందికి ప్రసవాలు చేశారు. ఎనిమిది మంది గైనకాలజిస్ట్‌లు తమ విధులను వంతుల ప్రకారం పనిచేస్తున్నారు. ప్రత్యేక పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసవాలు చేస్తున్నారు. ముందుగా అన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైతే సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 18 సాధారణ ప్రసవాలు చేశారు. కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేక ప్రసవాల విభాగం కూడా ఉంది. జనవరిలో మొత్తం ఏడుగురు కరోనా బారినపడిన గర్భిణులకు ప్రసవాలు చేశారు.

హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి వారికి

హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బితో బాధపడే గర్భిణులను ముందుగానే గుర్తించి అవసరమైన కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు వీరి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తొమ్మిది నెలలు నిండే వరకు మందులు ఇస్తుంటారు. వీరి కోసం కూడా ప్రత్యేక ప్రసవాల విభాగం ఉంది. ప్రసవాలు చేసే ముందు ప్రత్యేక కిట్లు, పరికరాలు వాడి ఆ తర్వాత ధ్వంసం చేస్తారు. ప్రతి ప్రసవం తర్వాత ప్రసవ విభాగాన్ని శుద్ధి చేస్తారు. ఇక్కడ షిప్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.

ఖనిలో 14 మందికి..

గోదావరిఖని ఆస్పత్రిలో గత జూన్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశాక ఆస్పత్రికి వచ్చిన కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు చేస్తున్నారు. ఆరు నెలల్లో 12 మంది కరోనా సోకిన మహిళలకు సాధారణ, మరో ఇద్దరికి శస్త్ర చికిత్సతో ప్రసవాలు చేశారు. ప్రసవం కోసం వచ్చిన ప్రతి మహిళకు కరోనా పరీక్షలు చేస్తుంటారు. పాజిటివ్‌ వచ్చిందనగానే గర్భిణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నర్సింగ్‌ సిబ్బంది ధైర్యం చెబుతూ.. వెంటనే వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలిసుతన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. మేమంతా మీ బంధువులమే అనుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా మాతో పంచుకోవాలని చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. బిడ్డను సైతం వారికి కొంతదూరంలో ప్రత్యేక పడకలో ఉంచుతూ నర్సింగ్‌ సిబ్బందే ఆలనాపాలనా చూస్తున్నారు. దీంతో రామగుండం ప్రాంతం నుంచే కాకుండా మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, కాటారం తదితర ప్రాంతాల్లోని గర్భిణులు నేరుగా గోదావరిఖని ఆస్పత్రికి వస్తున్నారు.

సమష్టి కృషితో ప్రసవాలు -డాక్టర్‌ అలీం, పరిపాలనాధికారి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం

కరోనా, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బితో బాధపడే గర్భిణులకు ప్రసవాలు చేయడంలో మాతా శిశు కేంద్రం వైద్యులు, వైద్య సిబ్బంది సమష్టిగా శ్రమిస్తారు. వారిని అందరూ అభినందించాల్సిందే. ప్రసవాల విషయంలో వెనుకాడరు.

మనోధైర్యం కల్పిస్తున్నాం.. - మహిమ, స్టాఫ్‌ నర్సు, గోదావరిఖని

కరోనా పాజిటివ్‌ వచ్చిందనగానే ఆందోళనకు గురయ్యే గర్భిణుల్లో మొదట సంపూర్ణ మనోధైర్యం కల్పిస్తున్నాం. వారి బంధువులకు అవగాహన కల్గిస్తాం. పౌష్టికాహారం, అవసరమైన మందులు వాడితే ఎంతటి వ్యాధినైనా జయించవచ్చనే ధైర్యం కల్పిస్తాం.. వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్నప్పుడు మాపై చూపుతున్న ప్రేమను మరిచిపోలేం. వీలైనంత మేరకు గర్భిణులు, వారి బంధువులు శుభకార్యాలు, సమావేశాలు పేరిట గుంపులుగా ఉండకపోవడం ఉత్తమం.

మీకు మేమున్నామంటూ...  -సుధ, స్టాఫ్‌ నర్సు, గోదావరిఖని

ప్రసవ సమయంలోనే కాకుండా కొందరికి మిగతా నెలల్లోను కరోనా సోకుతుంది. అలాంటి వారు ఇంట్లోనే ప్రత్యేకంగా ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన కల్గిస్తుంటారు. కొందరు ప్రసవం కోసం రాగా వైద్య పరీక్షల్లో కరోనా సోకిందని తెలియగానే భయాందోళనలకు గురవుతుంటారు. మనోధైర్యాన్ని కల్గిస్తాం. అయినా చాలా సేపటి తర్వాత వారిలో ప్రశాంతత నెలకొంటుంది. నిరంతర పర్యవేక్షణలో వారి స్థితిని బట్టి సాధారణ, శస్త్ర చికిత్స ప్రసవాలు చేస్తుంటాం.

2021 ఏప్రిల్‌ నుంచి జనవరి
వరకు ప్రసవాల వివరాలు
మొత్తం ప్రసవాలు 7393
సాధారణ 2445
శస్త్ర చికిత్సలు 4949
కరోనా బాధితులు 103
హెచ్‌.ఐ.వి.బారిన పడ్డవారు : 20
హెపటైటిస్‌ బి బారిన పడ్డవారు :16

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని