logo

పథకం ప్రకారమే ముగ్గురి హత్య

మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో గురువారం జగన్నాథం నాగేశ్వర్‌రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ల హత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం

Published : 22 Jan 2022 06:39 IST

టీఆర్‌నగర్‌ కేసులో పోలీసుల దర్యాప్తు

న్యూస్‌టుడే జగిత్యాల, జగిత్యాల గ్రామీణం

మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు

మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో గురువారం జగన్నాథం నాగేశ్వర్‌రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ల హత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి పోలీసు భద్రత మధ్య అంత్యక్రియలు జరిపారు. డీఎస్పీ ప్రకాశ్‌, రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, రూరల్‌ ఎస్సై అనిల్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి 8 మంది వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోషయ్య, శేఖర్‌, దాసరి రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై కేసు నమోదు చేయగా వారంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మంత్రాలు చేస్తున్నారని, పాత కక్షల కారణంగా అందరం కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నట్లు తెలిసింది.

ఆరోజు తప్పించుకుని..

నాగేశ్వర్‌రావుపై కొన్నేళ్లుగా మంత్రాలు చేస్తున్నాడని, అధిక వడ్డీతో తమను దోచుకుంటున్నాడని టీఆర్‌నగర్‌కు చెందిన ఎరుకల కాలనీ వాసుల్లో వ్యతిరేకత నెలకొంది. కాలనీలో 40 కుటుంబాలు ఒక వర్గం, నాగేశ్వర్‌రావు కుటుంబం ఒక వర్గంగా ఉంటున్నారు. అయితే గ్రామానికి చెందిన శంకరమ్మ అనే మహిళ అనారోగ్యంతో నాలుగు నెలల కిందట మృతి చెందింది. దీనికి కారణం నాగేశ్వర్‌రావు మంత్రాలు చేయడమేనని కాలనీ వాసులంతా ఒక్కటయ్యారు. అప్పు ఇచ్చిన డబ్బులు ఇస్తామని గత నెలలో సిరిసిల్ల సమీపంలో ఆగ్రహారం వద్దకు నాగేశ్వర్‌రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ను మృతి చెందిన మహిళ తరఫున వారు పిలిపించి ముగ్గురిపై దాడిచేశారు. ఈ దాడిలో కారు ధ్వంసం కాగా ఎట్టకేలకు ముగ్గురు తప్పించుకున్నారు. ప్రస్తుతం వారు గ్రామంలోనే ఉంటున్నారు. ప్రతి జనవరి 20న కుల సంఘం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాగైనా వారిని హతమార్చాలని పథకం రచించారు. కత్తులు, బరిసెలతో అక్కడికి చేరుకుని సమావేశం జరుగుతుండగానే ముందుగా నాగేశ్వర్‌రావుపై, మరికొంత రాంబాబు, రమేశ్‌పై దాడి చేశారు. నాగేశ్వర్‌రావు మెడ కోయగా ఛాతిభాగంలో రెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాంబాబుపై 16, రమేశ్‌పై 15 కత్తిపోట్లను గుర్తించారు. ఈ హత్యలో 8 నుంచి 10 మంది పాల్గొన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. అయితే హత్య చేయాలని అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు కాలనీ వాసులు శుక్రవారం పోలీసుల సమక్షంలో బహిరంగంగానే చెప్పారు. ఎంతో మందిని చంపారని, అధిక వడ్డీలతో తమను దోచుకున్నారని పలువురు మహిళలు పోలీసుల ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారు. నాగేశ్వర్‌రావు అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ మృతదేహాలకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక్కరు కూడా హాజరు కాలేదు. అతని కుటుంబానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అంత్యక్రియలకు హాజరుకాని కుమారులు

నాగేశ్వర్‌రావుకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడు రాజేశ్‌ను ప్రత్యర్థులు వెంబడించగా కొద్దిలో తప్పించుకుని పారిపోవటంతో ప్రాణాలతో బయటపడ్డారు. బంధువుల ఇళ్లలో తలదాచుకున్నాడు. రెండో భార్యకు కుమారుడు విజయ్‌, కూతురు ఉండగా విజయ్‌ సైతం భయంతో అతని బంధువు ఇళ్లలోనే ఉండిపోయి తండ్రి, సోదరుల అంత్యక్రియలకు హాజరు కాలేదు.


మరికొన్ని రోజులు పోలీసుల పికెట్‌

​​​​​​​పోలీసు బందోబస్తు

మిగిలిన నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు సైతం మంత్రాలు వస్తాయని వారిని హతమారుస్తామని, వారు గ్రామంలో ఉండవద్దని కాలనీవాసులు పోలీసుల ముందే హెచ్చరించడంతో మరికొన్ని రోజులు గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేస్తామని, చేతబడిపై అవగాహన కల్పిస్తామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. కాలనీవాసుల్లో నాగేశ్వర్‌రావు కుటుంబంపై ఇంకా కోపం ఉండడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు