logo

రిజిస్ట్రేషన్ల గూడుపుఠాణి

ఎక్కడైనా గజం భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేస్తే ఏమవుతుంది..? అమ్మో.. మన అధికారులు శివాలెత్తిపోతారు..? అవసరమైతే పోలీసుల సాయంతో గుడిసెలు కూల్చి వారిని రోడ్డున పడేస్తారు.

Updated : 23 Jan 2022 04:20 IST

రేకుర్తిలో నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

రేకుర్తిలోని ప్రభుత్వ స్థలమిలా..

ఎక్కడైనా గజం భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేస్తే ఏమవుతుంది..?

అమ్మో.. మన అధికారులు శివాలెత్తిపోతారు..? అవసరమైతే పోలీసుల సాయంతో గుడిసెలు కూల్చి వారిని రోడ్డున పడేస్తారు.

రాజకీయ పలుకుబడి ఉన్న వారి ప్రమేయంతో కొందరు విలువైన ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే.. ఏం.. చేస్తారు.?

ఇదేం ప్రశ్నం. ఏం చేస్తారు. ఉత్తినే చూస్తారు. కాలయాపనలతో సరిపెడ్తారు. రూ.కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసి దర్జాగా విక్రయించుకున్నా పట్టించుకోరు.

సరిగ్గా.. దశాబ్దకాలం నుంచి రేకుర్తిలో విలువైన ప్రభుత్వ భూముల విషయంలో ఇదే జరుగుతోంది. అక్రమంగా పుట్టుకొచ్చిన బోగస్‌ పట్టాలకు తోడుగా ఇష్టానుసారంగా ఇక్కడి ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నా.. మన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు కూత వేటు దూరంలోనే ఈ ప్రాంతమున్నా.. ఇక్కడి భూముల దయనీయ స్థితులపై గడిచిన దశాబ్ద కాలంగా ఏ ఒక్కనాడు జిల్లా పాలనాధికారి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. తరచూ కార్యాలయాల మెట్లు ఎక్కి పలువురు గోడు వెలిబుచ్చినా.. వారి మాటల్ని బేఖాతరు చేస్తూ ఇన్నాళ్లు నిర్లక్ష్యం వహించారు. ఎప్పటికప్పుడు అసలు ఇక్కడి భూముల కథ ఏంటని ఉన్నతస్థాయి హోదాలోని అధికారులు ఆరా తీస్తూ.. అక్రమాలపై కన్నెర్ర జేసి ఉంటే ఇక్కడి సర్కారీ స్థలాలకు ఇంతటి దుర్గతి పట్టేది కాదు. విలువైన జాగా ఇతరుల చేతుల్లో బందీ అయ్యేది కాదు.

అడ్డదారుల్లో అమ్మకాలు

ఇక్కడి ప్రభుత్వ భూములను ఆక్రమించడం అమ్మేయడమనేది షరామాములు వ్యవహారంగానే మారింది. అంతేకాకుండా నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాల్ని చేయిస్తూ పలువురు అందినకాడికి దండుకునే వ్యాపారానికి కొన్నేళ్లుగా తెరతీశారు. వందల సంఖ్యలో ఇళ్లతోపాటు స్థలాలకు రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారు. ప్రభుత్వ సర్వే నంబరు ఉంటే స్థలం రిజిస్ట్రేషన్‌ అవ్వదని గుర్తించిన ఆక్రమణదారులు మోసాల్లో కొత్త కోణాల్ని అన్వేషిస్తున్నారు. ఆ జాగాలకు ఇంటి నంబర్లను కేటాయిస్తూ వాటిని ఎంచక్కా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారు. ఈ ఏడాదిలో మొత్తంగా 33 ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ అయితే అందులో 12 కేవలం ఇంటి సంఖ్యతోనే ఇతరుల పేరుకు మారాయి. గతేడాది జరిగిన రిజిస్ట్రేషన్‌లలోనూ 289 కేవలం ఇంటి సంఖ్య ఆధారంగానే జరిగాయి. వాస్తవానికి గ్రామకంఠంలో ఉన్న స్థలాలకు సర్వే నంబర్లు ఉండవు. అందుకనే వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తారు. ఇదే సాకుతో రేకుర్తిలో అర్హుల ముసుగులో అనర్హులు ఎంచక్కా భూములను ఇతరులకు కట్టబెడుతున్నారు. 2018వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,584 గృహనివాస స్థలాల రిజిస్ట్రేషన్‌లు జరుగగా.. బోగస్‌ ఇంటి సంఖ్యలతోనే దాదాపుగా 20శాతం రిజిస్ట్రేషన్‌లవడం విస్తుగొలిపే విషయం.! రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ల శాఖ సమన్వయలోపంతోనే ఇలాంటి అక్రమాలకు ఊతమిచ్చినట్లవుతోంది.

సర్కారి స్థలంలో నిర్మాణ సామగ్రి

భూ..‘దాహమిలా’..!

భూమిలేని నిరుపేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్‌ పట్టాలు కూడా ఇక్కడ చాలా వరకు దుర్వినియోగమవుతున్నాయి. లావాణి పట్టాగా పిలిచే వీటిని కూడా గతంలో ఉన్న రెవెన్యూ అధికారుల్లో కొందరు ఇష్టానుసారంగా ఇతరులకు మధ్యలో కట్టబెట్టారనే అభియోగాలున్నాయి. బడాబాబులకు కూడా ఈ కోటాలో భూములు పుట్టుకొచ్చాయి. ఇలా అందించిన భూములను కేవలం వ్యవసాయానికి ఉపయోగించాల్సి ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్లో క్రయవిక్రయాలు కూడా లోలోపల జరుగుతున్నాయి. అసలైన అర్హులు మాత్రం వీటిని సక్రమంగానే ఉపయోగించుకుంటున్నా.. కొందరు మాత్రం వీటిని ఇతరులకు అమ్ముతున్నారు. సర్కారీ స్థలాల్లో ఇళ్ల పట్టాలను కూడా ప్రభుత్వం గతంలో అందించింది. ఇలా అందించినవి కొన్నైతే అక్రమంగా మిగులు స్థలాల్లో పుట్టుకొచ్చినవే కోకొల్లలు. పైగా ఒక లబ్ధిదారుకు అందించిన ఇంటిని ఇంటి స్థలాన్ని ఇతరులకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్లు వినియోగించుకుంటే ఆ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీన పర్చుకోవాలి. కానీ ఇక్కడ ఇన్నాళ్లుగా అధికారులు కనీసం గజం స్థలాల్ని తిరిగి తీసుకున్న దాఖలాలు లేనే లేవు. ఇలా తీరొక్క తరహాలో వీటి వెనుకల ఉండి చక్రం తిప్పుతున్న బడానేతలున్నారు. వీరి కనుసన్నల్లోనే ఇలా భూదాహాన్ని తీర్చుకునే చర్యలు కబ్జాలు, రిజిస్ట్రేషన్‌ల రూపంలో కనిపిస్తున్నాయి.

కబ్జాల లెక్క తీసేందుకు కదిలిన యంత్రాంగం

సర్వేకు వచ్చిన ఆర్డీఓ ఆనంద్‌, సిబ్బంది 

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రేకుర్తి భూ ఆక్రమణల గట్టును రట్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో జరిగిన కబ్జాలపై సమగ్ర విచారణకు జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు. వరసగా గత కొన్నాళ్లుగా ‘ఈనాడు’ దినపత్రికలో వస్తున్న కథనాలపై ఎట్టకేలకు స్పందించారు. శనివారం కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి సమగ్ర దర్యాప్తు జరపాలని ఆర్డీవో ఆనంద్‌తోపాటు భూమి కొలతల విభాగం ఏడీ లక్ష్మణ్‌లను ఆదేశించారు. ఇందుకోసం రెండు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరుగా విచారణ జరపడంతోపాటు పూర్తి నివేదికను రూపొందించాలని చెప్పారు. ఆక్రమణల్ని గుర్తించి వాటిని తిరిగి స్వాధీన పర్చుకోవాలని పురమాయించారు. హద్దు రాళ్లను పెట్టాలని పాలనాధికారి సూచించారు. దీంతో మధ్యాహ్నం నుంచి రెండు వేర్వేరు బృందాలు రేకుర్తిలో పర్యటించాయి. ఒక్కో బృందంలో రెవెన్యూ, నీటి పారుదల, సర్వేయర్లతో కూడిన 10 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ సర్వే నంబరు 55లో ఉన్న భూమి స్థితిగతుల్ని ఒక బృందంలోని పరిశీలించగా.. నద్దినాలా సమీపంలోని స్థలాల్ని మరో బృందం గమనిస్తోంది. వీరంతా వారం రోజులపాటు రేకుర్తి భూములపై పూర్తి సమాచారాన్ని సేకరించి, అసలు కబ్జా ఎంత జరిగిందనే లెక్కలతో నివేదికను జిల్లా పాలనాధికారికి అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని