logo

మురుగు జలాల ‘శుద్ధీకరణ’

కరీంనగర్‌ నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చకచకా పనులు కొనసాగుతున్నాయి. అన్ని హంగులతో తీర్చిదిద్దుకుంటున్న నగరంలో జనాభా పెరగడంతో పాటు ఇళ్ల సంఖ్య, కాలనీల విస్తీర్ణం పెరిగింది.

Published : 23 Jan 2022 02:25 IST

వాటర్‌ ప్లస్‌ హోదా కోసం నగరపాలిక కసరత్తు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

నగర వీధుల్లోంచి ప్రతిరోజు లక్షల లీటర్ల మురుగునీరు కాల్వల గుండా మానేరు నది వరకు ప్రవహిస్తోంది. ఇందులో కొంత నీరు పొలాలకు మళ్లిస్తుండగా..మిగతా నీరంతా నదిలో కలుస్తోంది.

కరీంనగర్‌ నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చకచకా పనులు కొనసాగుతున్నాయి. అన్ని హంగులతో తీర్చిదిద్దుకుంటున్న నగరంలో జనాభా పెరగడంతో పాటు ఇళ్ల సంఖ్య, కాలనీల విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు కాల్వల గుండా వచ్చే మురుగునీరంతా లక్షల లీటర్ల మేర ఉండగా మానేరు నదిలో ప్రవహిస్తోంది. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు లేకపోలేదు. 30ఎంఎల్‌డీల మురుగునీరు బయటకు వస్తుండగా ఇదంతా శుద్ధి చేయడం ద్వారా పునర్వినియోగానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇచ్చారు. వాటర్‌ ప్లస్‌ హోదా సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు.

రోజుకు 2 ఎంఎల్‌డీలు

భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం 38ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఉండగా ప్రస్తుతం సుమారు 3,500 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి రోజుకు 2ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీరంతా చెరువుల్లోకి వదిలి పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో శుద్ధి చేసిన నీరంతా మురుగునీటిలోనే కలుస్తోంది.

ఏమిటీ వాటర్‌ ప్లస్‌..

స్వచ్ఛతలో పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌+, ఓడీఎఫ్‌++ సర్టిఫికెట్లను అందిస్తోంది. ఇవన్నీ సాధించిన పుర, నగరపాలికలు ‘వాటర్‌ ప్లస్‌’ హోదాకు దరఖాస్తు చేసుకోవాలని గతేడాది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించే నగరాలకు ఈ గుర్తింపు ఇవ్వనుంది. ఈ హోదా దక్కితే స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో అదనపు మార్కులు కలుస్తాయి. వచ్చే మురుగునీటిలో 30శాతం శుద్ధీకరణ చేసిన అర్హత సాధించే వీలుంది.  

రెండు చోట్ల ఎస్టీపీల నిర్మాణం

నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం ఉంది. దీనికి తోడుగా అదనంగా రెండు చోట్ల నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌ హైవేలో కోతిరాంపూర్‌లో 14.9 ఎంఎల్‌డీలు, జ్యోతినగర్‌లో 13.3ఎంఎల్‌డీల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. ఈ పనులు పూర్తయితే నది జలాలు కలుషితమయ్యే ప్రమాదం తప్పడంతో పాటు ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హోదా సాధిస్తాం: - వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

మురుగునీటిని శుద్ధి చేసేందుకు కార్యాచరణ తీసుకున్నాం. ప్రస్తుతమున్న ఎస్టీపీ దగ్గర శుద్ధి చేసిన నీటిని సరైన విధంగా తిరిగి ఉపయోగించుకుంటే కచ్చితంగా వాటర్‌ ప్లస్‌ హోదా సాధించే వీలుంది. దీంతో పాటు అదనంగా స్మార్ట్‌సిటీలో రెండు ఎస్టీపీలు నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. వాటర్‌ప్లస్‌ హోదా కోసం చేస్తున్న కృషిని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి అవుతున్న నీరు పైపులైను ద్వారా చెరువుల్లోకి పంపించాలి. శుద్ధి చేసిన నీరంతా మళ్లీ మురుగునీటిలోనే కలిసిపోయి చెరువుల్లోకి వెళుతోంది.

డివిజన్లు  : 60
నగర విస్తీర్ణం : 65.33చకిమీ
జనాభా : 3,51,344
ఇళ్ల సంఖ్య: 62,840
రోజు వచ్చే మురుగునీరు: 30ఎంఎల్‌డీలు
ఎస్టీపీలో శుద్ధి  : 2ఎంఎల్‌డీలు
కొత్తగా నిర్మించేవి  : 2 ఎస్టీపీలు
నిధుల కేటాయింపు(అంచనా): రూ.5.26కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని