logo

ఆటో, బస్సు ఢీ

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం లక్కోర వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేల్పూర్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం..

Published : 23 Jan 2022 02:25 IST

అత్త, అల్లుడి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

లక్కోర వద్ద బస్సు ఢీకొన్న ఘటనలో నుజ్జయిన ఆటో

వేల్పూర్‌, మెట్‌పల్లి, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం లక్కోర వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేల్పూర్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఏకలవ్య కాలనీకి చెందిన అంగడి పోసాని (60), ఆమె అల్లుడు లొకిడి తిరుపతి (40) అంకాపూర్‌ మార్కెట్లో కూరగాయలు కొని తమ పట్టణంలో విక్రయిస్తుంటారు. అందులో భాగంగానే కమ్మర్‌పల్లి మండలం నాగపూర్‌కు చెందిన్‌ బానోత్‌ నాందేవ్‌ ఆటోను మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి వేరుసెనగ కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. లక్కోర వద్దకు వీరి ఆటో చేరుకోగానే.. ఆర్మూర్‌వైపు వెళ్తున్న వరంగల్‌-1 డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఆటో పైభాగం ఊడిపోవడంతో పాటు నుజ్జునుజ్జైంది. ముందు కూర్చున్న తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. చేయి తెగి రక్తమోడుతున్న పోసానిని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ నాందేవ్‌ను నిజామాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్‌, ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి పరిశీలించారు. తిరుపతి భార్య ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఔదార్యం చాటుకున్న సర్పంచి: లక్కోర సర్పంచి వంశీకృష్ణ కొన ఊపిరితో ఉన్న పోసానిని, తీవ్రంగా గాయపడిన బానోతు నాందేవ్‌ను తన కారులో ఆర్మూర్‌ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే పోసాని మృతి చెందారు. నాందేవ్‌ను వారి బంధువులు నిజామాబాద్‌ తరలించారు.

మృతి చెందిన పోసాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని