logo

భయం గుప్పిట్లో టీఆర్‌నగర్‌

సంచలనం కలిగించిన జగిత్యాల టీఆర్‌నగర్‌లో మంత్రాల నెపంతో జరిగిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎవరెవరికీ సంబంధాలు

Published : 23 Jan 2022 02:25 IST

నేడు ప్రధాన నిందితులను రిమాండ్‌కు పంపే అవకాశం

వణికిపోతున్న బాధిత కుటుంబ సభ్యులు

న్యూస్‌టుడే, జగిత్యాల, జగిత్యాల గ్రామీణం

బోసిపోయి కనిపిస్తున్న టీఆర్‌నగర్‌

సంచలనం కలిగించిన జగిత్యాల టీఆర్‌నగర్‌లో మంత్రాల నెపంతో జరిగిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. డీఎస్పీ ప్రకాశ్‌, రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, రూరల్‌ ఎస్సై అనిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ సింధూ శర్మ, అదనపు ఎస్పీ రూపేష్‌ కుమార్‌ సైతం దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ప్రధాన నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

20 మందికిపైగా..

మొదట 8 మందిపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కాల్‌డెటా ఆధారంగా సిరిసిల్ల, హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల వారికి కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్‌ 17న సిరిసిల్ల సమీపంలో అగ్రహారం వద్ద క్షుద్ర పూజలు చేస్తున్నాడని తండ్రి, ఇద్దరు కుమారులపై హత్యాయత్నం జరగగా ముగ్గురు తప్పించుకుని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హత్యాయత్నానికి పాల్పడ్డ వారి ప్రమేయం కూడా ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అగ్రహారం వద్ద జరిగిన దాడిలో పాల్గొన్న వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు. కుల సంఘాల నాయకుల హస్తం కూడా ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ కేసులో 20 మందికిపైగానే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది.

కొనసాగుతున్న పోలీసు పికెట్‌

ఇళ్లకే పరిమితం

ముగ్గురి హత్యల ఘటనతో టీఆర్‌నగర్‌ భయం గుప్పిట్లో ఉంది. నాగేశ్వర్‌రావు చిన్న కొడుకు రాజేశ్‌, రెండో భార్య కొడుకు విజయ్‌ భయంతో బంధువుల ఇళ్లలో తలదాచుకోగా ప్రస్తుతం నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యుల్లో మహిళలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తమను ఏమైనా చేస్తారేమోనని బాధిత కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్నారు. బాధితులకు రక్షణగా ఉన్నామంటూ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. టీఆర్‌నగర్‌లో 10 వేల మంది జనాభా ఉండగా రెండు రోజులుగా ఇళ్లకే పరిమితమై పోయారు. రోజంతా వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని