logo

రాజన్న ఆలయంలో కల్యాణాలకు కష్టం

దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు వివిధ పూజలు చేయించుకుంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 23 Jan 2022 02:25 IST

భక్తులకు సరిపోని మండపం

న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

ఇటీవల కల్యాణ పూజలో పాల్గొన్న భక్తులు

దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు వివిధ పూజలు చేయించుకుంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది పాల్గొనే వివిధ పూజా కార్యక్రమాలకు సరైన వసతి లేక అవస్థలు తప్పడం లేదు.

రాజన్నను దర్శించుకున్న భక్తులు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఆలయంలో కల్యాణ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హోమం, మహా లింగార్చన పూజలు  చేయించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వీటిని నిత్య కల్యాణమండపంలో ఆలయ అధికారులు, అర్చకులు నిర్వహిస్తుంటారు. కల్యాణాలు (టికెట్‌ ధర రూ.1,500) పైఅంతస్తులో, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సత్యనారాయణ వ్రతాలు (టికెట్‌ ధర రూ.600), మహాలింగార్చన (టికెట్‌ ధర రూ.1000) పూజలను నిర్వహిస్తుంటారు. వాస్తవానికి ఈ మండపంలో జరిగే పూజా కార్యక్రమంలో కూర్చోవడానికి 150 టికెట్లు జారీ చేశారు. ఒక్కోదానిపై ఇద్దరిని చొప్పున అనుమతిస్తుంటారు. ప్రస్తుతం ఆలయానికి పోటెత్తుతున్న భక్తులతో చాలా మందికి టికెట్లు లభించని పరిస్థితి ఉంది. డిమాండ్‌ మేరకు ఒక్కో సందర్భంలో 200 పైగా టికెట్లు విక్రయిస్తుంటారు. దీంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టికెట్లు లభించని సందర్భంలో ఆలయ సిబ్బందిపై భక్తులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

పరిమిత సంఖ్యలోనే టికెట్ల విక్రయం- బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, ఏఈవో రాజన్న ఆలయం

నిత్య కల్యాణ మండపం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి 100 నుంచి 150 వరకు కల్యాణ టికెట్లు ఇవ్వాల్సి ఉంది. భక్తుల డిమాండ్‌ మేరకు ఒక్కోసారి 200లకు పైగా ఇస్తున్నాం. అయినా చాలా మంది టికెట్లు లభించక వాయిదా వేసుకొని మరుసటి రోజు పూజలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌, ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో రోజుకు వంద వరకే ఇస్తున్నాం.

డిమాండు ఎక్కువ... టికెట్లు తక్కువ

ఆలయంలో వివిధ పూజలు చేయించుకునే టికెట్లు లభించకపోవడంతో మరుసటి రోజు వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందక ముందు ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాది మంది స్వామివారి దర్శనానికి వచ్చి వివిధ పూజల్లో పాల్గొంటుంటారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో రోజుకు 150 నుంచి 200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు. అయినా చాలా మందికి టికెట్లు లభించక మరుసటి రోజు టికెట్లు పొంది కల్యాణ పూజ జరిపించుకున్న సందర్భాలున్నాయి. కొవిడ్‌, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టికెట్లను పరిమిత సంఖ్యలో విక్రయిస్తున్నారు. దీంతో చాలా మందికి నిరాశ తప్పడం లేదు. వాస్తవానికి గతంలో తక్కువ మంది కల్యాణాలు చేయించుకోవడంతో ఈ పూజలన్నింటిని ఆలయ అద్దాల మండపంలో నిర్వహించేవారు. ప్రస్తుతం రద్దీ పెరగడంతో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన కళా భవనాన్ని నిత్య కల్యాణమండపంగా మార్చారు. ఇది కూడా ప్రస్తుత రద్దీకి ఏమాత్రం సరిపడటం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. టికెట్లు లభించక చాలా మంది పూజా కార్యక్రమాలను వాయిదా వేసుకొని వెళ్లిపోతున్నారు. పలువురు మరుసటి రోజు టికెట్‌ పొంది పూజలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని