logo

కేసీఆర్‌కు భయం మొదలైంది

ఇటీవల ఒక సర్వే ప్రపంచ వ్యాప్తంగా నంబర్‌ వన్‌ నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రకటించడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని

Published : 25 Jan 2022 02:20 IST

సిరిసిల్లలోని సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: ఇటీవల ఒక సర్వే ప్రపంచ వ్యాప్తంగా నంబర్‌ వన్‌ నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రకటించడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని లహరిగ్రాండ్‌లో సోమవారం జరిగిన భాజపా నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి నంబర్‌వన్‌ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు పాసైనప్పటి నుంచి ప్రజలను ద్రోహం చేస్తున్నారన్నారు. ఆరు పార్లమెంటు నియోజకవర్గ స్థానాలలో భాజపా విజయం ఖాయమని సర్వే తెలిపిందని, తెరాస పతనం ప్రారంభమైందన్నారు. ఎస్సీ నియోజకవర్గాలలో భాజపా సమన్వయ కమిటీలు వేసినట్లు చెప్పారు. ఎస్సీ నియోజక వర్గాలలో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని తెరాస సెంటిమెంట్‌ అని, అందుకే రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు అందజేస్తామని ప్రకటించారని ఆరోపించారు. మొన్నటి వరకు హామీ ఇచ్చిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే పూర్తిగా దళితబంధు అందజేయలేదని, ఇప్పుడు భాజపాపై భయం, ప్రజలలో వ్యతిరేకత కారణంగా రాష్ట్రమంతటా దళితులకు దళితబంధు అందిస్తాననడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏడుస్తున్నారన్నారు. ఏ స్థానికత కోసమైతే తెలంగాణ సాధించామో ఇప్పుడు ఆ స్థానికత కోసమే రాష్ట్రంలో గొడవలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒక సమస్య గురించి బాధపడుతుండగానే ప్రభుత్వం ఇంకో సమస్య వైపు దృష్టి మళ్లిస్తోందన్నారు. 317 జీవోను రద్దు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తుంటే జైలుకు పంపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు భాజపాపై భయంతో ప్రశాంతంగా పర్యటించలేకపోతున్నారన్నారు. అందుకే భాజపా కార్యకర్తలు, నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. తెరాస కార్యక్రమాలు నిర్వహించేప్పుడు లేని కరోనా భాజపా దీక్ష చేస్తుంటేనే గుర్తొస్తుందా అన్ని ప్రశ్నించారు. 317 జీవో రద్దు గురించి ఉద్యోగ, ఉపాధ్యాయులతో జాతీయ నాయకులతో ఈ నెలాఖరులో వర్చువల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడు విభాగాలుగా విభజించి నెలాఖరులో జాతీయ అధ్యక్షుడు నడ్డా గానీ, అమిత్‌షా వంటి నాయకులతో వర్చువల్‌ సమీక్ష నిర్వహించి 317 జీవో రద్దుకు ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించబోమన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌  తగ్గించాలని నిరసన తెలుపుతుండగా భాజపా పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు కాలు విరగగా బండి సంజయ్‌ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్‌ఛార్జి గంగాడి మోహన్‌రెడ్డి, ఆవునూరి రమాకాంత్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, గౌడ వాసు, ఎర్రం మహేష్‌, మ్యాన రాంప్రసాద్‌, బర్కం నవీన్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని