logo

టీకా.. ప్రజల ఆరోగ్యానికి రక్ష

ఒకప్పుడు కరోనాను చూసి కరీంనగర్‌ భయపడిందని.. ఇప్పుడు కరీంనగర్‌ను చూస్తే కరోనా భయపడే రోజులొచ్చాయని.. ఇందుకు టీకా విషయంలో సాధించిన విజయమే నిదర్శనమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో

Published : 27 Jan 2022 04:49 IST

విజయోత్సవ వేడుకలో మంత్రి గంగుల
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, న్యూస్‌టుడే- కరీంనగర్‌ వైద్యవిభాగం

కలెక్టరేట్‌లో కేకు కోస్తున్న మంత్రి గంగుల, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ తదితరులు

కప్పుడు కరోనాను చూసి కరీంనగర్‌ భయపడిందని.. ఇప్పుడు కరీంనగర్‌ను చూస్తే కరోనా భయపడే రోజులొచ్చాయని.. ఇందుకు టీకా విషయంలో సాధించిన విజయమే నిదర్శనమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో రెండో డోసు టీకాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వరకు కరీంనగర్‌ అన్నింటా ఆదర్శమనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లాపై ప్రత్యేకమైన మమకారం ఉంటుందని.. అందుకనే కరీంనగర్‌ జిల్లాలో తొలుత కేసులు బయటపడినప్పటి నుంచి ఇక్కడి ప్రజల ఆరోగ్య పరిరక్షణపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తోపాటు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది చూపించిన చొరవ వెలకట్టలేనిదన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాట్లాడుతూ.. కరోనా బారిన పడి ఎన్నో కుటుంబాలు నష్టపోయాయనే విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. మొదటి డోస్‌లో 104 శాతం,  రెండో డోసులో వందశాతం సాధించడం వెనుక ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంల సేవ ఉందన్నారు. జిల్లాలో ఇంటింటా జ్వర సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నామన్నారు. అదనపు పాలనాధికారి గరిమా అగ్రవాల్‌ మాట్లాడుతూ.. సరైన నాయకత్వానికి సమష్టి కృషి తోడైతే విజయాలు దరిచేరుతాయన్నారు. అంతకుముందు కేకు కోసి భారీ సిరంజీలను మంత్రి సహా అధికారులు ఆవిష్కరించారు.

అయిదు పీహెచ్‌సీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం

రెండో డోసు టీకాల విషయంలో స్ఫూర్తిదాయకమైన చొరవ చూపిన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మంత్రి గంగుల కమలాకర్‌ తన సొంత డబ్బులను అందించారు. కరీంనగర్‌లోని బుట్టి రాజారాంకాలనీ, శంకరపట్నం, సైదాపూర్‌, ఇల్లందకుంట, గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం మంత్రి ఇచ్చారు. వైద్యులతోపాటు ఇతర సిబ్బందిని మంత్రి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జువేరియా, ఇమ్యూనైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ సాజిదా, డీపీవో వీరబుచ్చయ్య, డిఫ్యూటీ మేయర్‌ చల్లా స్వరూపహరిశంకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని