logo

సమ్మక్క జాతరకు విస్తృత ఏర్పాట్లు

గోదావరి ఒడ్డున ఫిబ్రవరిలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తుండడంతో పాటు కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక కమిషనర్‌ బి.సుమన్‌రావు అన్నారు. 

Published : 27 Jan 2022 04:49 IST

కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన
రామగుండం నగరపాలక కమిషనర్‌ సుమన్‌రావు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: గోదావరి ఒడ్డున ఫిబ్రవరిలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తుండడంతో పాటు కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక కమిషనర్‌ బి.సుమన్‌రావు అన్నారు.  ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి తీరుతామని ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. ముఖాముఖి వివరాలివీ..

న్యూ : సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..?

కమిషనర్‌ : ఫిబ్రవరి 16, 17, 18వ తేదీల్లో జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే డీఎంఎఫ్‌టి నిధులు రూ.50 లక్షలతో రహదారి, మరో రూ.15 లక్షలతో దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం దాదాపు పూర్తయింది. మరో రూ.80 లక్షలతో జాతర స్థలంలో వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, రంగులు వేయడం, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణం, జాతర తర్వాత స్థలమంతా శుభ్రం చేయడం తదితర పనులు చేపట్టేందుకు ఇటీవల పాలకవర్గ తీర్మానం చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు

న్యూ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

కమిషనర్‌ : భక్తులు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా జాతర ఆవరణలో నిరంతరం ప్రచారం చేస్తాం. అవసరమైన చోట హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం. మైకుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్గిస్తున్నారు. ఇంటింట జ్వర సర్వేలోను నగరపాలిక పక్షాన స్వశక్తి సంఘాల ఆర్పీలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయునులు పాల్గొంటున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం, రసాయన ద్రావణాలను కొనుగోలు చేస్తాం. కాలనీల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయడంతో పాటు ఫాగింగ్‌ చేస్తాం.

న్యూ : అభివృద్ధి పనుల నిర్వహణ ఎలా ఉంది..?

కమిషనర్‌ : అభివృద్ధి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నాం. బిల్లుల చెల్లింపులో జాప్యం తదితర కారణాలతో కొన్ని పనులు నిలిచిపోగా తాజాగా బిల్లులు చెల్లించడంతో పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో చేపట్టనున్న పనులు వేగవంతమయ్యాయి. ఇంటింటికి తాగునీరు ప్రతి రోజు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లీకేజీల కారణంగా కొన్ని కాలనీల్లో ఇబ్బంది ఏర్పడుతుండగా అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తి పన్నును 100 శాతం వసూలు చేసేందుకు ఉపక్రమించాం. ఈ మేరకు నగరపాలక కార్యాలయంలో ప్రతి బుధవారం రెవెన్యూ మేళా నిర్వహిస్తున్నాం.

న్యూ : డంపింగ్‌ యార్డు సమస్యను ఎలా పరిష్కరిస్తారు..?

కమిషనర్‌ : ఇంతకాలంగా జీడీకే 11ఎ గని సమీపంలోని సింగరేణి స్థలాన్ని డంపింగ్‌ యార్డుగా వినియోగించుకున్నాం. ప్రస్తుతం వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మల్యాలపల్లి సమీపంలోని ఖాళీ స్థలంలోకి చెత్తను తరలిస్తున్నాం. జిల్లా అదనపు పాలనాధికారి కుమార్‌దీపక్‌ చొరవతో రామగుండం తహసీల్దార్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి డంపింగ్‌ యార్డుకు అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుంది. చెత్త తరలించే వాహనాలన్నింటిని వినియోగంలోకి తెచ్చి ప్రతి రోజు ఇంటింట చెత్త సేకరణ నిరంతరంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం.

న్యూ : నగరపాలక నిర్వహణను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

కమిషనర్‌ : జమ్మికుంట పురపాలక కమిషనర్‌గా పనిచేస్తున్న నాకు పూర్తిస్థాయి అదననపు బాధ్యతలతో రామగుండం నగరపాలక కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. వారంలో మూడు రోజులు రామగుండంలో, మరో మూడు రోజులు జమ్మికుంటలో పనిచేస్తున్నాను. నగరపాలక నిర్వహణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలకే అత్యధిక సమయం సరిపోతోంది. మిగతా సమయంలో మేయర్‌, ఆయా డివిజన్ల కార్పొరేటర్ల సహకారంతో డివిజన్లలో పర్యటిస్తూ సమస్యలను నేరుగా పరిశీలిస్తున్నాను. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా కొన్నింటికి అవసరమైన నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి పనులు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలో సుమారు రూ.15 కోట్లతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని