logo

విదేశాల్లో రయ్‌..రయ్‌..

విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.

Published : 27 Jan 2022 04:49 IST

అంతర్జాతీయ లైసెన్స్‌లకు పెరుగుతున్న ఆదరణ

జిల్లా రవాణా శాఖ కార్యాలయం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణావిభాగం: విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆయా దేశాల్లో భారతీయులు ఎన్‌ఆర్‌ఐలుగా స్థిరపడుతున్నారు. అక్కడ వాహనాలు నడపాలంటే లైసెన్స్‌ తప్పనిసరి కావడంతో ఇక్కడ అంతర్జాతీయ లైసెన్స్‌లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఉపాధికి సైతం

చదువు, కొలువులు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారిలో చాలామంది సొంతంగా వాహనాలు కొనుగోలు చేస్తుండగా మరికొందరు ఇతరుల వాహనాలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు.

ఏడాది పాటు...

రాష్ట్ర రావాణా శాఖ జారీ చేసే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు విదేశాల్లో సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతోంది. దీని ఆధారంగా ఆయా దేశాల్లో వాహనాలు నడపడానికి అనుమతిస్తారు. ఇది ఒక విధంగా లెర్నింగ్‌ లైసెన్స్‌లా పనిచేస్తుంది. ఆయా దేశాల నిబంధనలు అనుసరించి గడువులోగా అక్కడి లైసెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉండటంతో ఎక్కువ మంది మన దేశం నుంచే ఇంటర్నేషనల్‌ డీఎల్‌ తీసుకుంటున్నారు.

జారీ ఇలా

పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం రవాణా శాఖ అధికారులు అంతర్జాతీయ లైసెన్స్‌లు జారీచేస్తారు. ఏ జిల్లాలో అయితే డీఎల్‌ తీసుకుంటామో అదే జిల్లాలో ఐటీడీఎల్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 872 మంది లైసెన్స్‌లు పొందారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో, అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జారీ చేశారు.

కార్డులకు కటకట?

ఐటీడీఎల్‌ కార్డులకు కొరత ఉండటంతో సకాలంలో అందడం లేదని సమాచారం. అంతర్జాతీయ లైసెన్స్‌ పొందిన వారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. కార్డుదారులు విదేశాలకు వెళ్లిపోతే ఇతరుల ద్వారా కాని, కొరియర్‌ ద్వారా పంపించాల్సిన పరిస్థితి ఉంది.


లైసెన్స్‌ పొందడం ఇలా...

ఐడీఎల్‌ తీసుకోవాలనుకుంటే ముందుగా సొంత దేశంలో లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసేప్పుడు ఇక్కడ తీసుకున్న డీఎల్‌తో పాటు పాస్‌పోర్టు (గడువు ఆరు నెలలైనా ఉండాలి), మనం ఏ దేశానికి అయితే వెళ్తున్నామో అందుకు సంబంధించిన వీసా జత చేయాలి. వీసా త్వరలో వస్తుంది అనుకుంటే అందుకు తగిన ఆధారాలు సమర్పించాలి. ఆరోగ్యవంతంగా (శారీరకంగా దృఢంగా) ఉన్నట్లు మెడికల్‌ ధ్రువీకరణ పత్రం (ప్రభుత్వ  గుర్తింపు పొందిన వైద్యుడు ఇచ్చినది), ఫామ్‌-1ఏ జతచేయాలి. పూర్తి వివరాలతో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. కేటాయించిన తేదీ రోజు ఆర్టీఏ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేయాలి. ఫీజు రూ.1500 వరకు ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.


ప్రపంచ వ్యాప్తంగా....
-చంద్రశేఖర్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఉపరవాణా కమిషనర్‌

స్వదేశంలో అంతర్జాతీయ లైసెన్స్‌ తీసుకుంటే విదేశాల్లో పొందడం సులువుగా ఉంటుంది. ఉపాధి కోసం వెళ్లి చోదకులుగా పని చేసే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ జారీ చేసిన ఐడీఎల్‌ ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఆయా దేశాల నిబంధనల మేరకు గడువు లోగా పొందాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని