logo

చిత్ర వార్తలు

రూ.25 లక్షలు వెచ్చించి మహిళల కోసం ‘షీ మొబైల్‌ మూత్రశాలలు’ వాహనాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం  కొనుగోలు చేశారు. బస్సులోనే మహిళల మూత్రశాలలు, తల్లులు చిన్నారులకు పాలు ఇవ్వడానికి గది, మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి గదిని ఏర్పాటు చేశారు.

Published : 27 Jan 2022 05:19 IST

రూ.25 లక్షలు నిరుపయోగమేనా..!

రూ.25 లక్షలు వెచ్చించి మహిళల కోసం ‘షీ మొబైల్‌ మూత్రశాలలు’ వాహనాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం  కొనుగోలు చేశారు. బస్సులోనే మహిళల మూత్రశాలలు, తల్లులు చిన్నారులకు పాలు ఇవ్వడానికి గది, మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి గదిని ఏర్పాటు చేశారు. సమావేశాలు జరుగుతున్నపుడు ఈ బస్సును ఏర్పాటు చేయాలి కానీ ఎక్కడ కూడా ఈ బస్సును తీసుకురావడం లేదు. డ్రైవర్‌ లేడని పురపాలక సంఘం అధికారులు సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం బస్సును ఉపయోగించకుండా రగుడులో ఉన్న పంపుహౌజ్‌లో ఉంచారు. ప్రస్తుతం బస్సును వినియోగించకుంటే స్క్రాప్‌గా మారే అవకాశం ఉంది.

-సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే


మురుగు నిలిచి దుర్గంధం

నగరంలోని మార్కెట్‌ రిజర్వాయర్‌ గోడకు ఆనుకొని మురుగునీటి కాల్వ నిర్మాణ పనులు వదిలేయడంతో మురుగునీరంతా అక్కడే నిలిచింది. అక్కడే మూత్ర విసర్జన చేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. విద్యుత్తు నియంత్రిక తొలగిస్తే ఆ ప్రాంతంలో స్మార్ట్‌ పనులు పూర్తి కానున్నాయి.

-న్యూస్‌టుడే, సుభాష్‌నగర్‌


మరమ్మతు నాసిరకం.. వృథా యథాతథం

సుల్తానాబాద్‌ అలంగీర్‌ మసీదు ఎదుట మిషన్‌ భగీరథ పైపు లీకయి తాగునీరు వృథాగా పోతోంది. రెండు రోజుల కిందటే పురపాలక సిబ్బంది మరమ్మతు చేయగా బుధవారం మళ్లీ మొదటికొచ్చింది. పట్టణంలోని శ్రీరాంనగర్‌లోనూ సిబ్బంది నాలుగు రోజుల కిందట పైపులైన్‌ గేటువాల్వు మరమ్మతు చేయగా తిరిగి తాగునీరంతా రహదారులపై పారుతోంది. బల్దియా తాగునీటి సరఫరా సిబ్బంది అలసత్వం, నాసిరకం పనులతో ఇలా జరుగుతోందని పట్టవాసులు ఆరోపిస్తున్నారు.

-న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌


ప్రారంభానికి ముందే శిథిలం

గోదావరి ఒడ్డున వీధి వ్యాపారులకు ఏర్పాటు చేసిన దుకాణ సముదాయం ప్రారంభం కాకముందే శిథిలమవుతోంది.. వీధి వ్యాపారుల సంక్షేమం దృష్ట్యా గోదావరి ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర స్థలంతో పాటు నగరంలోని పలు చోట్ల ఇలాంటి షెడ్లను ఏర్పాటు చేశారు. సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతో సమ్మక్క జాతర స్థలంలో దుకాణాల తలుపులు, కిటికీలు చోరుల పాలయ్యాయి. కొన్ని శిథిలమయ్యాయి. అధికారులు స్పందించి వెంటనే తగు మరమ్మతులు చేయించి వీధి వ్యాపారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

-న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


సర్వీసు రహదారి.. అధ్వానం

మీరు చూస్తున్న ఈ రోడ్డు ఎక్కడో మారుమూల ప్రాంతంలోది అనుకుంటే పొరపాటే.. నిరంతరం రద్దీగా ఉండే గోదావరిఖనిలోని రాజీవ్‌ రహదారి సర్వీసు రహదారి దుస్థితి ఇది.. గంగానగర్‌లోని ఉపరితల వంతెన పక్కనున్న ఈ రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ముందుకు వెళ్లాక రాజీవ్‌ రహదారిని కలిపే చోట రహదారి మరీ అధ్వానంగా ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేసి వాహనదారుల తిప్పలు తప్పించాల్సి ఉంది.

- న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


రైల్వేగేటు మరమ్మతు.. వాహనాల దారి మళ్లింపు

రామడుగు మండలం వెంకటగిరి రైల్వేగేటు వద్ద  మరమ్మతు పనులు చేపట్టారు. బుధవారం రైల్వేగేటు మూసివేసి నిర్మాణ పనులు చేపట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. రామడుగు, పెగడపల్లి మండలాలకు వెళ్లే వాహనాలు కొత్తపల్లి, కొక్కెరకుంట మీదుగా వెళ్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు సమీపంలోని వెదిర, వెంకటగిరి పొలాల దారి నుంచి వెళ్తున్నారు.

-న్యూస్‌టుడే,రామడుగు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని