logo

అదనపు కాలువకు భూములివ్వబోమంటూ ధర్నా

ఇప్పటికే వరదకాలువ, సాగునీటి ఉపకాలువలు, కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌, జాతీయ రహదారికోసం వేలాది ఎకరాల విలువైన భూములు కోల్పోయాం..ఇప్పుడేమో అదనపు వరదకాలువకు మరోసారి వ్యవసాయ భూములు బలవంతంగా లాక్కునేందుకు కుట్ర

Published : 28 Jan 2022 03:33 IST

కురిక్యాల వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళలు, రైతులు

గంగాధర, న్యూస్‌టుడే: ఇప్పటికే వరదకాలువ, సాగునీటి ఉపకాలువలు, కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌, జాతీయ రహదారికోసం వేలాది ఎకరాల విలువైన భూములు కోల్పోయాం..ఇప్పుడేమో అదనపు వరదకాలువకు మరోసారి వ్యవసాయ భూములు బలవంతంగా లాక్కునేందుకు కుట్ర చేసి తమను ముంచుతారా అంటూ గంగాధర మండలం కురిక్యాల వద్ద రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కొండన్నపల్లి, న్యాలకొండపల్లి, తాడిజెర్రి, కురిక్యాల, రంగారావుపల్లి, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు, మహిళలు ధర్నా చేశారు. ఇప్పుడున్న వరదకాలువ నుంచి నీటిని తరలించాల్సి ఉండగా దాని పక్కనే అదనంగా కాలువ తవ్వకానికి భూసేకరణతో తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వరదకాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో వ్యవసాయ భూములన్నీ జాలువారుతున్నాయని వాపోయారు. వరి వేస్తే ఉరి అంటున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు కాలువలు ఎందుకు తవ్వుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ధర పలుకుతుండగా ప్రభుత్వం తమను ముంచుతుందని ఆరోపించారు. గ్రామీణ ఏసీపీ విజయసారథి, చొప్పదండి సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై నరేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భూనిర్వాసితులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని