logo

పార్టీ అభ్యున్నతే ఎజెండా

గులాబీ పార్టీకి మరింత గుబాళింపు అందించేలా శక్తియుక్తుల్ని ఒడ్డుతామని పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని అన్ని వయస్సుల వారి సహకారం.. సమష్ఠి నిర్ణయాలే తమ స్ఫూర్తి మంత్రాలని చెబుతున్నారు. నాలుగు జిల్లాల తెరాస కొత్త అధ్యక్షులతో ‘ఈనాడు’ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వారి మాటల్లోనే...

Updated : 28 Jan 2022 03:41 IST
తెరాస జిల్లాల నూతన అధ్యక్షులు
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

గులాబీ పార్టీకి మరింత గుబాళింపు అందించేలా శక్తియుక్తుల్ని ఒడ్డుతామని పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని అన్ని వయస్సుల వారి సహకారం.. సమష్ఠి నిర్ణయాలే తమ స్ఫూర్తి మంత్రాలని చెబుతున్నారు. నాలుగు జిల్లాల తెరాస కొత్త అధ్యక్షులతో ‘ఈనాడు’ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వారి మాటల్లోనే...


ప్రశ్నావళి

1. పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించడంపై మీరెలాంటి అనుభూతి పొందుతున్నారు.?

2. పార్టీ అభ్యున్నతికి అమలుచేయనున్న వ్యూహాలు?

3. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేలా మీ ప్రణాళికలు?

4. ఉద్యమకారులకు అన్యాయం, గ్రూపులు, ఇతర సమస్యలను ఎలా అధిగమిస్తారు.?

5. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది.?


మరింత బలోపేతం..
- కోరుకంటి చందర్‌, పెద్దపల్లి

1. తెరాసలో ఒక కార్యకర్తగా ఒకప్పుడున్న నన్ను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా చేయడం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. పార్టీ కోసం పనిచేసే నాయకత్వానికి ఉద్యమకారునికి దక్కిన ఫలితమిది.

2. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌ అడుగుజాడల్లో నడిచాం. పదవులు లేనినాడే ప్రజల బాగోగుల గురించి ఆలోచించి, రాష్ట్రం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు రాష్ట్రం సాధించిన తరువాత తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడుతున్నాం. చేస్తున్న.. చేయబోతున్న అభివృద్ధిని ప్రజలకు పార్టీ ద్వారా తెలియజేస్తాం.

3. ప్రజలకు అన్యాయం చేస్తూ తప్పుడు మాటలతో తప్పుదోవ పట్టించే ప్రత్యర్థి పార్టీలపై పోరుని పక్కాగా కొనసాగిస్తాం. కాంగ్రెస్‌, భాజపాలు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

4. పార్టీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయమై చర్చించుకుంటాం. అవసరాన్ని బట్టి అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారాన్ని అన్వేషిస్తాం. మా పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉండవు. ఒకవేళ ఎక్కడైనా వచ్చినా వాటిని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకుంటాం. పెద్దల సలహాలు స్వీకరిస్తాం.

5. జిల్లాలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వచ్చే ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన విధంగా పార్టీని గ్రామాల్లో పట్టణాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతాం. తరచూ మండల, జిల్లాస్థాయి సమావేశాలతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తాం.


బాధ్యతాయుతంగా ముందుకు..
- తోట ఆగయ్య, రాజన్న సిరిసిల్ల

1. పార్టీ పట్ల విశ్వసనీయత చూపిస్తూ చేసిన పనితీరుకి వచ్చిన బహుమతిగా భావిస్తున్నా.  జిల్లా అధ్యక్ష పదవితో మరింత బాధ్యత పెరిగిందని నేను నమ్ముతున్నా.

2. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలతో ప్రజల మనసులను గెలుచుకుంటూ ముందుకు వెళ్తాం. మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లాలోని అందరు నాయకులు, కార్యకర్తల సలహాలతో ముందుకుసాగుతా. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన విధానాలతో పార్టీని మరింతగా బలోపేతం చేస్తా.

3. ఏ ప్రాంతమైనా ప్రతి పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యముంటుంది. అంతమాత్రాన ప్రత్యర్థి పార్టీల హవా ఉంటున్నట్లు కాదు. పార్టీకి ప్రత్యేక గుర్తింపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. దానిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచుకునే ప్రయత్నాలను తప్పకుండా చేపడతాం. ఇతర పార్టీలకు అందనంత ఎత్తున మా జెండాను నిలుపుతాం.

4. అలాంటిదేమీ ఉండదు. తెరాస అందరినీ ఆదరిస్తుంది. చిన్నచిన్న మనస్పర్థలు వస్తే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సమస్యలను తీర్చుకుంటాం. అందరి లక్ష్యం పార్టీ అభ్యున్నతి కాబట్టి ఎలాంటి వివాదాలకు తావివ్వం. పార్టీలో సీనియర్లు మొదలు కార్యకర్తల వరకు అందరికీ మేలు చేసేలా అధిష్ఠానం నిర్ణయాలు ఉంటాయని విశ్వసిస్తున్నా. మా జిల్లాలో పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది.

5. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటవడంలో కీలక పాత్రను పార్టీ పరంగా పోషిస్తాం. కేసీఆర్‌ మార్క్‌ మంత్రమే మా బలం. కేటీఆర్‌లాంటి మంత్రి ఉండటం అదనపు బలం.


కీలక పాత్ర పోషిస్తా
- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల

1. పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడే నాకు ఇలాంటి మంచి అవకాశాన్ని పార్టీ అధినేత కల్పించారు. మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది.

2. ఎమ్మెల్యేలు, మంత్రి సహకారంతో జిల్లాలో గులాబీ పార్టీకి తిరుగులేదనే తీరుని చేతల్లో చూపిస్తా. గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త మొదలు సీనియర్లందరి సేవలు పార్టీకి అందేలా చూస్తా.

3. ప్రత్యర్థి పార్టీలు ఇన్నాళ్లుగా చేసిందేమీ లేదు. కొత్తగా ఇకపై చేస్తారనే నమ్మకం సైతం ప్రజలకు కలగడం లేదు. అలాంటప్పుడు వారి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు మా పార్టీ తరఫున ఎండగట్టేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తాం. ప్రత్యర్థి పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా మా పార్టీ ఆదరణను ప్రజల్లో మరింతగా పెంచుకుంటాం.

4. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్లవేళలా అండగా ఉన్నారు. కష్టపడిన వారికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నేరుగా వారితో మాట్లాడతా. అందరి ఆలోచనలకు అనుగుణంగా నడచుకుంటూ ఎలాంటి గ్రూపులు లేకుండా చూస్తా.

5. యువత, మహిళలు పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేలా చూస్తా. రైతులు, కార్మిక సంఘాల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. సమావేశాల నిర్వహణతోపాటు కార్యకర్తలకు అవసరమైన తర్ఫీదు పార్టీ పరంగా అందించేందుకు చొరవ చూపుతా.


నమ్మకాన్ని నిలబెట్టేలా..
- జీవీ రామకృష్ణారావు, కరీంనగర్‌

1. వందశాతం సంతోషంగా ఉన్నా. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాకు కీలక బాధ్యతను అధిష్ఠానం అప్పగించింది. నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తా.

2. అధికారంలో ఉన్న పార్టీ కావడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తా. అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతా. కరీంనగర్‌లో కొత్తగా పార్టీ కార్యాలయం నిర్మితమైంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. పార్టీ శ్రేణులకు అవసరమైన శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. పథకాల ప్రచారంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం.

3. పోరాటాల జిల్లా అయిన కరీంనగర్‌లో ఉద్యమం నుంచి ప్రజలకు తెరాసతో మంచి అనుబంధముంది. అందుకనే తెరాసకు రెండు సార్లు అధికారాన్నిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో భాజపా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

4. చిన్నచిన్నవి ఎక్కడైనా ఉంటే క్రమశిక్షణ పరంగా సమస్యలను తీరుస్తాం. పార్టీకోసం పనిచేసేవారికి మంచి పదవులు వస్తాయనేందుకు వరుసగా కరీంనగర్‌ జిల్లాలో ఉద్యమకారులకు వచ్చిన అవకాశాలే నిదర్శనం.

5. ఇప్పటికే వేసిన పలు కమిటీల అధ్యక్షులను మరింత చురుగ్గా పనిచేసేలా చూస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు అవగాహన కల్పిస్తాం. మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని