logo

తూకంలో వ్యత్యాసం.. వినియోగదారులకు శాపం

చౌకధరల దుకాణాలకు సరఫరా చేసే బియ్యం సంచుల్లో తూకంలో వ్యత్యాసం కనిపిస్తోంది. ధర్మారం మండలానికి పెద్దపల్లి గోదాము నుంచి బియ్యం సరఫరా అవుతాయి. ఈ నెల 24 నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లోని దుకాణాలకు బియ్యం కోటా చేరుతోంది.

Published : 28 Jan 2022 03:33 IST

రేషన్‌ దుకాణాలకు బియ్యం పంపిణీ తీరు

న్యూస్‌టుడే, ధర్మారం: చౌకధరల దుకాణాలకు సరఫరా చేసే బియ్యం సంచుల్లో తూకంలో వ్యత్యాసం కనిపిస్తోంది. ధర్మారం మండలానికి పెద్దపల్లి గోదాము నుంచి బియ్యం సరఫరా అవుతాయి. ఈ నెల 24 నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లోని దుకాణాలకు బియ్యం కోటా చేరుతోంది. కొత్తూరులోని దుకాణంలో బస్తాను తూకం వేయగా 43.880 కిలోలు, కటికెనపల్లిలో 45.550 కిలోల బియ్యం మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం గోదాము నుంచి దుకాణాలకు చేరవేసే సమయంలో బస్తాను తూకం వేసి, గన్నీ సంచి బరువు 580 గ్రాములు తగ్గించి పంపించాల్సి ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేకుండా ఒక్కో సంచిలో 50 కిలోల చొప్పున లెక్కగట్టి దుకాణాలకు పంపుతున్నారు. దుకాణాల్లో ఈపీడీఎస్‌ విధానంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా, అందరికీ అందజేయక ముందే బియ్యం నిండుకుంటున్నాయి. ఫలితంగా కార్డుదారులకు బియ్యం సరిపోవడం లేదు. ఒక్కో దుకాణానికి 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఇలా జరుగుతోందని, అధికారులను అడిగితే వేర్వేరు విభాగాల అధికారులతో తనిఖీలు చేయించి, కేసులు నమోదు చేయిస్తారనే భయంతో మిన్నకుంటున్నామని వివిధ గ్రామాల డీలర్లు వాపోతున్నారు. ఈ విషయమై పెద్దపల్లి గోదాం ఇన్‌ఛార్జి తిరుపతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా బియ్యాన్ని తూకం వేశాకే పంపిస్తున్నామన్నారు. గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ గోదాములకు తరలించే సమయంలో కొన్ని సంచులు చిరిగిపోతాయని, అలాంటి వాటిని మాత్రమే దుకాణానికి ఒకటి, రెండు పంపుతామన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ను సంప్రదించగా బియ్యాన్ని సంచుల లెక్కన కాకుండా తూకం వేసి, గన్నీ సంచుల బరువును తగ్గించి పంపిస్తామని తెలిపారు. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథనిలలో ఎంఎల్‌ఎస్‌ పాయింటు, 413 చౌకధరల దుకాణాలున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే సమస్యలు తొలగి, కార్డుదారులందరికీ బియ్యం అందుతాయి.
కటికెనపల్లిలో 45.550 కిలోలు మాత్రమే..
కొత్తూరులో 43.880 కిలోలు చూపిస్తున్న బియ్యం బస్తా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని