logo

రైతుబంధువు...

రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పథకం ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలకు ఆర్థిక చేదోడుగా మారింది. గతనెల 28 నుంచి ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాలకు విడుదల చేశారు.

Published : 28 Jan 2022 03:33 IST

ఉమ్మడి జిల్లాలో రూ. 649.07 కోట్ల చెల్లింపు
నిరుటికన్నా పెరిగిన 42 వేల మంది

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పథకం ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలకు ఆర్థిక చేదోడుగా మారింది. గతనెల 28 నుంచి ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాలకు విడుదల చేశారు. నిరుడు యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 6.06 లక్షల మందికి రూ.638.22 కోట్ల నిధులను ఇవ్వగా ప్రస్తుత యాసంగిలో 6.49 లక్షల మందికి రూ.649.07 కోట్ల పెట్టుబడి సాయం నిధులను అందించారు. మరణించినవారి పేర్లను, నాలా బదలాయింపు జరిగిన భూములను రైతుబంధు పథకం నుంచి తొలగించగా నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారు, భూమి బదలాయించబడి రికార్డుల్లో చేరినవారు కొత్తగా జాబితాలోకి వచ్చారు. ఈ క్రమంలో నిరుటి యాసంగితో పోలిస్తే ఈ యాసంగిలో 42,974 మంది రైతులు అదనంగా రైతుబంధు పథకంలో నమోదుకాగా నిరుటికన్నా రూ.10.85 కోట్ల నిధులు అధికంగా వచ్చాయి.

* 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా తొలుత ఎకరాకు రూ.4 వేలచొప్పున ఇచ్చి తదుపరి సీˆజన్‌లో రూ.5 వేలకు పెంచారు. తొలుత రైతువారీగా చెక్కులనివ్వగా తదుపరి రైతుల బ్యాంకు ఖాతాలకే నేరుగా హైదరాబాద్‌ నుంచి నిధులను బదిలీ చేస్తున్నారు. తొలుత భూ పరిమితి లేకపోగా 2019 వానాకాలంలో 10 ఎకరాల్లోపు భూమిఉన్న రైతులకు చెల్లింపులు జరపగా 2020 యాసంగిలో కేవలం 5 ఎకరాల భూమి ఉన్నవారికి మాత్రమే రైతుబంధు నిధులిచ్చారు. తదుపరినుంచి ప్రస్తుత యాసంగి వరకుకూడా అన్ని సీˆజన్లలోనూ ఎలాంటి భూ పరిమితి విధించకుండా అందరికీ ఎకరాకు రూ.5 వేల చొప్పున నిధులను బదలాయించారు. భవిష్యత్తులోనూ ఎక్కువ భూమి ఉన్నవారికి పథకాన్ని వర్తింపచేయరని, భూ పరిమితి విధిస్తారని ఇప్పటికే చాలామంది తమ పేరిటగల భూముల్లో కొంతభాగాన్ని కుటుంబసభ్యుల పేరిట విభజించటంతో రైతుల సంఖ్యకూడా ఏటికేడు పేరుగుతోంది. రికార్డులు సరిగాఉన్న రైతులందరికీ ఈ సీˆజన్‌లో నిధులందినట్లు జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి పి.సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని