logo

శాతవాహనలో ఇంటిదొంగలు

ఎట్టకేలకు శాతవాహనలోని ఇంటిదొంగల గుట్టు రట్టయింది. విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంచేలా ఇటీవల అందిన 12బీ హోదాను అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేసిన ఐదుగురు ఒప్పంద అధ్యాపకులపై సస్పెన్షన్‌ వేటు

Published : 20 May 2022 03:24 IST

ఐదుగురు ఒప్పంద అధ్యాపకులపై వేటు

12బీని అడ్డుకునేందుకు యూజీసీకి లేఖలు

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- శాతవాహన విశ్వవిద్యాలయం: ఎట్టకేలకు శాతవాహనలోని ఇంటిదొంగల గుట్టు రట్టయింది. విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంచేలా ఇటీవల అందిన 12బీ హోదాను అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేసిన ఐదుగురు ఒప్పంద అధ్యాపకులపై సస్పెన్షన్‌ వేటు పడింది. గడిచిన కొన్నాళ్లుగా జరుగుతున్న విచారణలో అసలు వాస్తవాలు వెల్లడయ్యాయి. నెలన్నర రోజుల కిందట ఇక్కడి విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో కీలకమైన 12బీ హోదాను రాకుండా ఉండాలనే దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు రాశారనే అభియోగాలతో జరిపిన అంతర్గత విచారణలో పాఠాలు బోధించే వారే ఈ పాపాలకు పాల్పడ్డారనేది తేటతెల్లమైంది. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యల్ని తీసుకుంటూ బాధ్యులుగా గుర్తించిన ఐదుగురిని సర్వీస్‌ నుంచి తొలగించేలా ఉపకులపతి వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 

ఇదేం పద్ధతి సార్లూ..!

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే హోదాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారెవరనేది తెలియడంతో వారి తీరుపై తీవ్రస్థాయిలో విద్యార్థులు తోటి అధ్యాపకులు విమర్శల్ని గుప్పిస్తున్నారు. పలు కోర్సులకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేవనేలా ఆరోపించడంతోపాటు ఎట్టిపరిస్థితుల్లో ఆ హోదాను అందించవద్దనేలా అజ్ఞాత వ్యక్తులు రాసినట్లు మెయిల్స్‌ పంపించిన తీరుపై విద్యావేత్తలు కూడా గుర్రుమంటున్నారు. ముఖ్యంగా తెలుగు, గణితం, ఆంగ్లం, బాటనీ విభాగాల్లో లోపాలున్నాయని వారు లేఖల్లో పేర్కొన్న తీరుని తప్పుబడుతున్నారు. కాగా పట్టుబడిన వారిలో కొందరు గతంలోనూ పలు రకాలుగా వివాదాల్లోనూ కాలు దూర్చిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా అక్కడి ప్రాంగణంలో ఉన్న లోటుపాట్లను ఆసరాగా చేసుకుని విద్యార్థులతో రాజకీయాలు చేయించడం సహా విద్యార్థుల్ని వేధించారనే అభియోగాలు ఒకరిపై ఉన్నాయి. పట్టుబడిన కంప్యూటర్‌లో విశ్వవిద్యాలయానికి సంబంధించిన కీలకమైన పత్రాలు కూడా వారి వద్ద ఉన్న తీరుని విచారణాధికారులు గుర్తించారు. వరుసగా ఇక్కడి ప్రతిష్ఠను దిగజార్చేలా జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు మంచి బోధన అందించే వాతావరణాన్ని కల్పించేలా ఇక్కడి పరిస్థితులు మారాలని.. పూర్తిస్థాయి పర్యవేక్షణ పెరగాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక మీదట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించమని.. లేఖలు రాసినట్లుగా విచారణలో తేలడంతోనే ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఉపకులపతి ఎస్‌.మల్లేశం స్పష్టం చేశారు.

 వారిని పట్టుకున్నారిలా..

ఇక్కడి విశ్వవిద్యాల తీరుని జాతీయ సభ్యుల బృందం కొన్నాళ్ల కిందట సందర్శించి ఇక్కడి బోధన సహా వసతుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందే ఇక్కడి ప్రజాప్రతినిధులు కేంద్రస్థాయి అధికారులకు ఈ హోదా అందటం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరించడంతో ఎట్టకేలకు ఈ జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఏడాది మార్చి 23వ తేదీన యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) ఉత్తర్వులు వెలువర్చడంతో అందరిలో సంతోషం వ్యక్తమైంది. ఇలా ఆదేశాలు అందిన సుమారు 16 రోజుల తరువాత ఇక్కడి విశ్వవిద్యాలయానికి ఈ హోదాను అందించవద్దనేలా పలువురు గుర్తు తెలియని వ్యక్తులు యూజీసీకి ఆరు లేఖల్ని రాశారని రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టి వాస్తవాల్ని విన్నవిస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి వారికి విన్నవిస్తూనే.. వెంటనే నలుగురు అధ్యాపకులతో కూడిన విచారణ కమిటీని వేశారు. ఇలా ఆ కమిటీ వాస్తవాల్ని తెలుసుకునే క్రమంలో అనుమానం వచ్చిన ఓ అధ్యాపకుడి కంప్యూటర్‌ను పరిశీలించగా అందులో నుంచే ఈ ఆరు లేఖలు వెళ్లినట్లు తెలిసింది. మొదట గుర్తించిన వ్యక్తితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురికి ఈ నెల 15న షోకాజ్‌ నోటీసులు అందించి తాజాగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని