logo

క్లరికల్‌ సిబ్బందిపై తగ్గనున్న పని భారం

సింగరేణిలో పనిచేస్తున్న క్లరికల్‌ సిబ్బందిపై పని భారం తగ్గనుంది. ప్రస్తుతం సింగరేణిలో క్లరికల్‌ సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న వారిపై పని భారం పడుతుంది. చాలా కాలంగా

Published : 20 May 2022 03:47 IST

అంతర్గత అభ్యర్థులతో ఖాళీల భర్తీ

న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న క్లరికల్‌ సిబ్బందిపై పని భారం తగ్గనుంది. ప్రస్తుతం సింగరేణిలో క్లరికల్‌ సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న వారిపై పని భారం పడుతుంది. చాలా కాలంగా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నా యాజమాన్యం స్పందించలేదు. సంస్థలో పనిచేస్తున్న అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో యాజమాన్యం 155 క్లరికల్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 పోస్టులను భర్తీ చేసేందుకు అంతర్గత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. సింగరేణిలో ప్రస్తుతం 1500 మంది వరకు క్లరికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. 3000 మందికి పైగా ఉన్న క్లరికల్‌ సిబ్బంది ఉద్యోగ విరమణ పొందడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇటీవల కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో యాక్టింగ్‌ క్లర్కులుగా  సంస్థ వినియోగించుకుంటుంది. ఇంకా కొరత ఉండటంతో కొత్తగా అర్హులైన అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది.

 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సంస్థ ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నివేదించాలని సూచించింది. ఆ తర్వాత జూన్‌ 25 లోగా దరఖాస్తుల హార్డ్‌కాపీ పోస్టు ద్వారా పంపించాలని వెల్లడించింది. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదిలో 190 మస్టర్లు, ఉపరితల విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు 240 మస్టర్లు తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా డిగ్రీ కనీస అర్హతతో పాటు కంప్యూటర్‌ కోర్సులో 6 నెలల డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయోపరిమితితో సంబంధం లేదు. అభ్యర్థులు తాము పనిచేస్తున్న గని, విభాగం అధికారి ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గని, విభాగం అధికారి జత చేసి పర్సనల్‌ జీఎం రిక్రూట్‌మెంట్‌ విభాగానికి పంపించాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఖాళీలు స్థానికులు(సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాలు), 5 శాతం స్థానికేతరులైన అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయనుంది. అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. 85 శాతం మార్కులు రాత పరీక్ష, 15 శాతం మార్కులు అసెస్‌మెంటు రిపోర్టుకు కేటాయించనున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే మెరిట్‌ జాబితాను వెంటనే ప్రకటించనున్నారు.

విద్యావంతులు ఎక్కువగా..

సింగరేణిలో ప్రస్తుతం ఎక్కువ శాతం మంది విద్యావంతులు పనిచేస్తున్నారు. గతంలో చాలా మంది నిరక్ష్యరాసులు ఉండే వారు. వారసత్వ ఉద్యోగాలతో చాలా మంది డిగ్రీ ఆపైన చదివిన వారు ఎక్కువగా చేరారు. బదిలీ, జనరల్‌ మజ్దూర్‌లుగా పనిచేస్తున్న వారిలో 90శాతం మంది ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీలు చదివిన వారు ఉన్నారు. దీంతో అంతర్గత అభ్యర్థులతో 155 క్లరికల్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంది.

పారదర్శకంగా నియామకాలు:  బలరాం, సింగరేణి సంచాలకులు

క్లరికల్‌ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదు. ప్రతిభపై ఆధారపడి అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలి. తొలిసారి అంతర్గత అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. త్వరలో బయటి వారితో కూడా మరికొన్ని క్లరికల్‌ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాం. త్వరలోనే ప్రకటన విడుదల చేస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని