logo

నిఘా నీడలో పది పరీక్షలు

‘విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగిస్తున్నాం. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశాం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు

Published : 20 May 2022 03:48 IST

 జిల్లాలో 49 కేంద్రాలు..   8,167 మంది విద్యార్థులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ‘విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగిస్తున్నాం. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశాం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. నేల రాతలు లేకుండా బెంచీలు, కుర్చీలు సమకూర్చాం. ఇన్విజిలేటర్ల నియామకంలో పారదర్శకత పాటించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం.’ అని జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి తెలిపారు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంత వాతావరణంలో రాయాలని సూచించారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లపై డీఈవోతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా పలు అంశాలు వెల్లడించారు.

న్యూ: పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత ఎలా ఉంది?

డీఈవో: కొవిడ్‌ కారణంగా రెండేళ్లు బడులు తెరుచుకోక కొంత ఇబ్బంది ఏర్పడింది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో డిసెంబరు నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను విభజించాం. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తి చేస్తున్నాం. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు పాలనాధికారిణి నిధులు కేటాయించారు.  

న్యూ: మాస్‌కాపీయింగ్‌ ఆరోపణలున్నాయి కదా?

డీఈవో: పదో తరగతి పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేదు. జిల్లాలో 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్, 4 సిట్టింగ్‌ స్క్వాడ్, 4 సంచార బృందాలు(రూట్‌ అధికారుల) పర్యవేక్షణ ఉంటుంది. మొత్తం 741 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించాం. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా తీవ్రతరం చేశాం. గత ఘటనలు పునరావృతం కాకుండా ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పించాం.

న్యూ: పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఉంటుందా?

డీఈవో: పదో తరగతి పరీక్షలకు ఈ నిబంధన అమలు చేయడం లేదు. 9.30కి పరీక్ష మొదలవుతుంది. అంటే 8.45 నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దూర ప్రాంతాల వారికి ఆలస్యమైతే 5 నిమిషాల వరకు అనుమతిస్తాం. కేంద్రాల్లోకి చరవాణులు, ఎలక్ట్రికల్, ఇతర సామగ్రికి అనుమతి లేదు. ఇన్విజిలేటర్లు చరవాణిని తీసుకెళ్లరాదు.

న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

డీఈవో: జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 16 ప్రైవేటు, 33 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. మొత్తం 8,167 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇందులో 4167 మంది బాలురు, 4000 మంది బాలికలున్నారు. పోలీసు, కోశాగార, తపాలా కార్యాలయాలు అందుబాటులో ఉన్న సీ కేటగిరీ కేంద్రాలు 12 ఉన్నాయి. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, ఇతర వసతుల్లో ఎలాంటి లోపం లేకుండా చర్యలు చేపట్టాం. 

న్యూ: కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందా?

డీఈవో: ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నీడలో పరీక్ష జరుగుతుంది. గతంలో ధర్మారం మండలం మల్లాపూర్‌ గురుకుల కేంద్రంలో మాత్రమే ఈ వసతి ఉండేది. ఈసారి అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో 17 చోట్ల సీసీ కెమెరాలు అందుబాటులో ఉండగా మిగిలిన చోట్ల అద్దెకు సమకూర్చుతున్నాం. చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరా బిగించనున్నాం. పరీక్ష ముగిసే వరకు పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని