logo

అంజన్న ఆలయ సమన్వయ సమావేశం వాయిదా

కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు జరగునున్న హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం సాయంత్రం ఏర్పాటు

Published : 20 May 2022 03:57 IST

మల్యాల, న్యూస్‌టుడే: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు జరగునున్న హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి(కోఆర్డినేషన్‌ మీటింగ్‌) ఎమ్మెల్యే రవిశంకర్, జిల్లా పాలనాధికారి, ఎస్పీ హాజరు కాకపోవడంతో ఆలయ అధికారులు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమన్వయ సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రాంమోహన్‌రావు, ఆలయ పాలకమండలి సభ్యులు, దాదాపు ఏడెనిమిది శాఖల అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే, కలెక్టరు, ఎస్పీ రాకపోవడంతో చివరికి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్‌ తెలిపారు. మరో మూడు రోజుల్లో (22న) ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నప్పటికీ సమన్వయ సమావేశాన్ని శనివారం నాటికి వాయిదా వేయడం గమనార్హం.  

నాసిరకం పనులపై పాలకమండలి సభ్యుల ఆగ్రహం: హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వేస్తున్న రంగుల్లో నాణ్యత లోపించడంపట్ల ఆలయ పాలకమండలి సభ్యులు ఆలయ అధికారులు, ఇంజినీరింగు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న జయంతి తర్వాత పెద్ద జయంతి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి 40 రోజుల వ్యవధి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆలయ గోపురాలు, గోడలపై పాత రంగుల పెచ్చులను తొలగించి నాణ్యమైన రంగులు వేయించాల్సి ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని దేవాదాయశాఖ ఇంజినీరింగు డీఈ రఘునందన్, ఏఈ లక్ష్మణ్‌రావును ప్రశ్నించారు. గోడలపై లేచిన పెచ్చులను అధికారులకు చూపించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని