logo

సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు

తమకు తెలియకుండానే కౌన్సిల్‌ అజెండాలను రూపొందిస్తూ..  మున్సిపల్‌ ఛైర్‌పర్సన్, కమిషనర్లు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైస్‌ ఛైర్‌పర్సన్‌

Published : 20 May 2022 04:19 IST

నిధుల దుర్వినియోగంపై విచారణకు డిమాండ్‌

హుజూరాబాద్, న్యూస్‌టుడే: తమకు తెలియకుండానే కౌన్సిల్‌ అజెండాలను రూపొందిస్తూ..  మున్సిపల్‌ ఛైర్‌పర్సన్, కమిషనర్లు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైస్‌ ఛైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మలతో పాటు మరో 25మంది అధికార పార్టీ, భాజపా కౌన్సిలర్లు గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించారు. ఇందులో భాగంగా ఛైర్‌పర్సన్, కమిషనర్‌ వైఖరికి నిరసనగా అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు భాజపా కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్, కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం నిర్వహించేందుకు ఛైర్‌పర్సన్‌ గందె రాధిక కౌన్సిల్‌ అజెండాను రూపొందించగా దాదాపుగా 25మంది హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. 25మంది కౌన్సిలర్ల సంతకాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న పత్రాన్ని ఆయా కౌన్సిలర్లు విలేకరులకు అందజేశారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి పనుల కోసం రూ.85కోట్లు కేటాయించగా వార్డుల్లో పనులు కాకుండానే బిల్లులు చెల్లిస్తున్నారని, పనులు, బిల్లుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిషన్‌ భరీరథ పథకం కింద పైపులైన్లు, ప్యాచ్‌ల పనుల కోసం రూ.15కోట్లు కేటాయించగా అస్తవ్యస్తంగా పనులు చేశారని, నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా రూ.42లక్షలు కేటాయిస్తుండగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వీటిపై వివరాలు అడిగితే రెండేళ్లుగా దాటవేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్‌ అజెండాలో రూ.50వేలు దాటిన పనులకు కౌన్సిలర్లకు వివరాలివ్వాలని గతంలో తీర్మానించినప్పటికీ అమలు పర్చడం లేదని, రూ.83లక్షలతో స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశారని, దీనికి సంబంధించిన బిల్లులు అడిగితే ఇవ్వడం లేదన్నారు. అలాగే డీజిల్‌ బిల్లులు, ఇతర బిల్లులపై వివరాలు ఇవ్వాలని కోరగా సమాధానం ఇవ్వకపోగా సాధారణ నిధుల నుంచి లక్షల రూ.లు ఖర్చు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. హరితహారం కింద మొక్కలు, ట్రీగార్డులు, సపోర్టు కర్రలు, గుంతల తవ్వకం పనులకు ఎలాంటి బిల్లులు లేకుండానే లక్షలు ఖర్చు చేశారని మొక్కలు నాటకుండానే నాటినట్లు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపి ఛైర్‌పర్సన్, కమిషనర్‌లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. దీనిపై ఛైర్‌పర్సన్‌ గందె రాధిక, కమిషనర్‌ వెంకన్న మాట్లాడుతూ కౌన్సిలర్ల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని