logo

ఆధార్‌ అనుసంధానం నిదానమే!

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద జిల్లాలోని లబ్ధిదారులైన రైతులు తమ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసుకునే విషయంలో జిల్లాలో నిదానమనే తీరు కనిపిస్తోంది. సంబధిత వెబ్‌సైట్‌లో వివరాల్ని అందించే విషయంలో జిల్లాలో నిర్లక్ష్య వైఖరియే ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ అధికారులు ముందు నుంచి అవగాహన కల్పించకపోవడం.. తెలిసినా చాలా మంది కర్షకులు ఇంకా సమయం ఉందనే సాకుతో కాలయాపన చేస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రూ.6వేలను అందిస్తోంది.

Published : 22 May 2022 04:09 IST

కిసాన్‌ సమ్మాన్‌ నిధికి మరో 10రోజులే గడువు

ఈనాడు, కరీంనగర్‌


రైతుల వివరాల్ని నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద జిల్లాలోని లబ్ధిదారులైన రైతులు తమ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసుకునే విషయంలో జిల్లాలో నిదానమనే తీరు కనిపిస్తోంది. సంబధిత వెబ్‌సైట్‌లో వివరాల్ని అందించే విషయంలో జిల్లాలో నిర్లక్ష్య వైఖరియే ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ అధికారులు ముందు నుంచి అవగాహన కల్పించకపోవడం.. తెలిసినా చాలా మంది కర్షకులు ఇంకా సమయం ఉందనే సాకుతో కాలయాపన చేస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రూ.6వేలను అందిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల అనర్హులు రైతుల జాబితాలో ఉన్నారని గుర్తించిన కేంద్రం అసలైన అర్హులకే ఈనిధిని అందించాలని భావించింది. ఇందుకోసం గడిచిన నెల రోజులుగా అవకాశం కల్పించింది. కిసాన్‌ సాయాన్ని అందుకునే వారు విధిగా ఇప్పటికే పోర్టల్‌లో ఉన్న తమ వివరాలకు ఆధార్‌ను కలిపేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు ఆయా క్లస్టర్ల వారీగా రైతులతో సమావేశాల్ని నిర్వహిస్తూ చరవాణి ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ఫలాలు అందేలా చొరవను చూపిస్తున్నారు.

35 శాతం మాత్రమే ఆసక్తి..!

జిల్లా వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు 92,413 మంది ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 32,368 మంది మాత్రమే వివరాల్ని సమర్పించేందుకు ఆసక్తిని చూపించారు. ఇలా కేవలం 35శాతం ప్రగతి మాత్రమే ఆయా మండలాల వారీగా కనిపించింది. ఇంకా 65 శాతం మంది నమోదు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా కోతలు ఉండటం, పంట దిగుబడిగా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే విషయంలో రైతులు హడావుడిగా ఉండటం వల్లనే ఈ విషయంలో అనుకున్న పురోగతి లేదనేది స్పష్టమవుతోంది. ఒక్క రామడుగు మండలంలో మాత్రం సగానికిపైగా రైతులు చొరవను చూపించారు. నాలుగు మండలాల్లో కనీసం 30శాతం లక్ష్యం కూడా చేరలేదు. ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియడం లేదు. ఏఈవోలు ప్రతి రోజు రైతు వేదికల వద్ద కూర్చుని వివరాల్ని నమోదు చేస్తున్నా.. చాలామంది ఇతర పనుల్లో ఉన్నామని.. తరువాత సమాచారం ఇస్తామంటూ దాటవేత ధోరణిని చేతల్లో చూపిస్తున్నారు. ఈ నెల 31 వతేదీ ఇందుకు చివరి తేదీ అవడంతో మరో పది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపల అనుసంధానం కాకపోతే రైతులకు త్వరలో అందే కిసాన్‌ సమ్మాన్‌నిధి ఆర్థిక సాయం అందదని వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చెబుతున్నారు.

పూర్తి చేయిస్తాం : - శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లాధికారి, కరీంనగర్‌

ప్రత్యేక డ్రైవ్‌లతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు పథకం లబ్ధిని అందించాలన్నదే మా లక్ష్యం. అందుకనే ఈ వారం, పది రోజుల్ని సవాలుగా స్వీకరిస్తున్నాం. వాట్సప్‌ సమూహాలు, దండోరాలు ఇతరత్రా ప్రచారాలతో అవగాహన కల్పిస్తున్నాం. రైతులు కూడా వారి చరవాణిలో నేరుగా ఆధార్‌ను లింక్‌ చేసుకోవచ్ఛు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కేవైసీ అప్‌డేట్‌ ఆప్షన్‌ ద్వారా ఓటీపీ సంఖ్య నమోదు చేస్తూ సులభంగా ప్రక్రియను కొనసాగించవచ్ఛు ప్రతి గ్రామంలో ఏఈవోలు తిరుగుతున్నారు. వారిని కలిసి కొద్దిసేపట్లోనే ఈ తంతుని ముగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని