logo

సాధన నిరంతరం.. సమకాలీన పరిజ్ఞానం

‘తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీ పరీక్షల్లో రాణించలేరు అనేది అపోహ మాత్రమే.. గ్రామీణ నేపథ్యమైనా పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు’ అంటున్నారు..

Published : 22 May 2022 04:09 IST

సమయ ప్రణాళికతోనే పోటీ పరీక్షల్లో రాణింపు

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

‘తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీ పరీక్షల్లో రాణించలేరు అనేది అపోహ మాత్రమే.. గ్రామీణ నేపథ్యమైనా పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు’ అంటున్నారు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్ఢి సమయ ప్రణాళిక.. సమకాలీన అంశాలపై పట్టు సాధిస్తే పోటీ పరీక్షల్లో నెగ్గుకురావొచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎలా సన్నద్ధం కావాలి? ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలి? తదితర విషయాలపై సీపీతో ‘ఈనాడు’ మాట్లాడింది. ఆ ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

కాళేశ్వరం జోన్‌ పరిధిలో యూనిఫాం ఉద్యోగ ఖాళీలు మొత్తం 1,630 ఉన్నాయి. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు దీని పరిధిలోకే వస్తాయి. 28 సివిల్‌ ఎస్సైలు, ఒక ఏఆర్‌ ఎస్సై, 4 అగ్నిమాపక ఎస్సైల ఖాళీలు ప్రకటించారు. సివిల్‌ కానిస్టేబుళ్లు 274, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 167, అగ్నిమాపక శాఖలో 16 ఖాళీలున్నాయి. 95 శాతం స్థానికులకే కేటాయించడం సానుకూలాంశం. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మంచిర్యాలలో 1025, పెద్దపల్లిలో 800 ఖాళీలున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయిన నేపథ్యంలో యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్లు పెంచారు. హోంగార్డులకు గతంలో గరిష్ఠంగా 40 ఏళ్ల వయోపరిమితి ఉంటే ప్రస్తుతం కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్ల వయసును నిర్ధారించారు.

ఆంగ్ల భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి

సమకాలీన అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా ఉదయం టీవీలో వార్తలు చూడటంతో పాటు రెండు తెలుగు దినపత్రికలు, ఒక ఆంగ్ల పత్రిక, సంపాదకీయ(ఎడిటోరియల్‌) పేజీలు, ముఖ్యాంశాలను రాతపుస్తకంలో నమోదు చేసుకోవాలి. పరభాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో క్రమం తప్పకుండా సాధన చేయాలి. మేం ఉద్యోగాలకు సన్నద్ధమైన రోజుల్లో చరవాణులు, సామాజిక మాధ్యమాలు లేవు. కచ్చితంగా విషయ పరిజ్ఞానం కోసం గ్రంథాలయాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్నా గూగుల్‌లో వెతుకుతున్నాం. ఇంట్లో కూర్చుని పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్ఛు సమస్తం మొబైల్‌లో అందుబాటులో ఉంటోంది.

1600 మీటర్ల పరుగు కీలకం

మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసుపల్లి. అమ్మానాన్న వ్యవసాయం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు మాధ్యమమే. 1989లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. అమెరికాకు వెళ్దామనుకున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్‌ పరీక్షలు రాశా. అనంతరం సివిల్‌ సర్వీసెస్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లి చదువుకున్నా. గ్రూప్‌-1 ఖాళీలు ప్రకటించగానే దరఖాస్తు చేశా. 1993లో గ్రూప్‌-1కు ఎంపికయ్యా. డీఎస్పీగా మొదటి పోస్టింగ్‌ 1996లో జనగామలో విధుల్లో చేరాను. సివిల్స్‌ పరీక్షలు కూడా తెలుగు మాధ్యమంలోనే రాశా. డెరెక్టుగా డీఎస్పీగా ఎంపిక కావడంతో శారీరక దారుఢ్య పరీక్షలు లేవు. నేను సంగారెడ్డి జిల్లాలో ఎస్పీగా పని చేసినప్పుడు పోలీసు నియామక పరీక్షల పర్యవేక్షణ విధులు నిర్వహించాను. అక్కడ 40 శాతం మంది 800 మీటర్ల పరుగులో ఫెయిలయ్యారు. లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌ సులభంగా ఉన్నప్పటికీ రన్నింగ్‌ కష్టం. 1600 మీటర్ల రన్నింగ్‌ చేసేందుకు కఠోరంగా శ్రమించాల్సిందే. నిత్యం రెండు పూటలా వ్యాయామం, నడక, పరుగులో సాధన చేయాలి.

గుడిపల్లిలో వేయి మందికి శిక్షణ

పోలీసు ఉద్యోగాల కోసం మంచిర్యాల జిల్లా గుడిపల్లి బెటాలియన్‌లో 1000 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. మూడు పూటలా భోజన వసతి కల్పిస్తూ తాగునీరు, పోలీసు ఇన్‌స్ట్రక్టర్లు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాం. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ శిక్షణ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో యువతకు సౌకర్యాలు లేకపోవడంతో కరీంనగర్‌లోని స్టడీ సర్కిల్‌లో ఎంపికైన వారికి శిక్షణ అందిస్తున్నాం. కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 200 మంది పోలీసులు పదోన్నతి పరీక్షలు రాసేందుకు అనుమతులు తీసుకున్నారు.


* ఎక్కువ మంది ఉద్యోగార్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఖాళీలు ప్రకటించగానే చదవడం ప్రారంభిస్తారు. ఇలా చదివితే ఉద్యోగం రాదు. పోటీ పరీక్షల కోసం నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాలి.

* విషయ పరిజ్ఞానం పెంచుకుంటే ఎక్కడైనా రాణిస్తాం. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు సన్నద్ధత ఆపొద్ధు

* సబ్జెక్టులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఒక విషయానికి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఇలా చేస్తే సులభంగా పాఠ్యాంశాలు బోధపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని