logo
Published : 22 May 2022 04:09 IST

తూము తెంపారు.. వదిలేశారు

రెండేళ్లుగా చెరువు నీటి వృథా

న్యూస్‌టుడే, అంతర్గాం


బ్రహ్మణపల్లిలో కన్నిరెడ్డికుంట తూముకు గండి పడటంతో వృథాగా పోతున్న నీరు

చెరువు ఓ గ్రామానిది.. అందులో చేపలు పట్టేది మరో గ్రామం వారు. చేపలు పట్టేందుకని మత్స్యకారులు అనధికారికంగా తూము వద్ద గండి కొట్టి చేపలు పట్టుకొని వెళ్లారు. మరమ్మతులు చేపట్టలేదు. ఈ విషయమై నీటిపారుదలశాఖ అధికారి ఫిర్యాదుతో ఆరుగురు మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తూము నిర్మాణం తిరిగి చేపట్టలేకపోతున్నామని అధికారులు తెలిపారు. తమపై కేసు కొట్టి వేస్తేనే తూము నిర్మాణం చేపడ్తామని మత్స్యకారులు అంటున్నారు. ఇలా రెండేళ్లు గడిచింది. చెరువు కింద ఉన్న 100 ఎకరాల పంట పొలాలకు సాగు నీరు లేకుండా పోయింది. గండి పడిన ప్రదేశం నుంచి వృథాగా నీరు దిగువకు పారుతోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గాం మండలం బ్రహ్మణపల్లి శివారు కన్నిరెడ్డికుంటకు 2020 మే 16న పక్క గ్రామమైన ఆకెనపల్లి మత్స్యకారులు చేపలు పట్టేందుకు పొక్లెయిన్‌తో గండి కొట్టారు. తూము ఒకవైపు పూర్తిగా తొలగించి నీరు తొలిగాక చేపలు పట్టుకొని వెళ్లారు. బ్రహ్మణపల్లి రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరాంపూర్‌ మండలం పెద్దరాజుపల్లికి చెందిన ఓ గుత్తేదారు చేపలు పట్టుకునే పని పొందాడు. ఈ గుత్తేదారు చెబితేనే తాము తూము తెంపి చేపలు పట్టామని తమకేమీ తెలియదని ఆకెనపల్లి మత్స్యకారులు అంటున్నారు. తూము తిరిగి నిర్మిస్తానని మత్స్యకారులపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని గుత్తేదారు కోరడంతో నీటిపారుదలశాఖ అధికారులు అందుకు అంగీకరించారు. సిమెంటు పైపులు కావాలనడంతో రూ.10 వేలు ఖర్చు చేసి అధికారులు పైపులు తెప్పించారు. అధికారులు అడిగిన ప్రతిసారీ పనులు త్వరలోనే ప్రారంభిస్తానంటూ దాటవేస్తున్నాడు. ఇటు మత్స్యకారులు తాము కూలి పనుల నిమిత్తం ఆ రోజు వచ్చామని తూము నిర్మించేందుకు అవసరమైన డబ్బు తమ వద్ద లేదని చెబుతున్నారు. రూ.3 లక్షలు ఖర్చు చేస్తేనే నిర్మాణం పూర్తవుతుంది. కుంట కింద 100 ఎకరాల ఆయకట్టు ఉంది. గండి పడిన చోటు నుంచి నీరంతా వృథాగా పారడంతో చెరువు ఎండిపోయింది. నీరు లేని కారణంగా పంటలు వేసుకోలేకపోతున్నామని, తూము నిర్మించాలని రైతులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరో నెల రోజుల్లో వర్షాలు కురిసి కుంట నీటితో నిండే అవకాశమున్నందున ఆలోగా కొత్త తూము నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను బ్రహ్మణపల్లి సర్పంచి బండారి ప్రవీణ్‌కుమార్‌, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మండల ఏఈఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా తూము నిర్మించాలని గుత్తేదారు, మత్స్యకారులను మరోసారి కోరతామని.. వారు స్పందించకుంటే ఉన్నతాధికారులకు చెప్పి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని