logo
Published : 22 May 2022 04:09 IST

నెరవేరనున్న ఏళ్లనాటి కల

వంతెన నిర్మాణానికి శ్రీకారం

 

న్యూస్‌టుడే, కోనరావుపేట

 


కోనరావుపేటలో వంతెన నిర్మాణ పనులకు వేసిన కొలతలు

మండల కేంద్రంలోని ప్రధాన కూడలి బస్టాండు, పోలీస్‌స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మధ్య ఉన్న లోలెవల్‌ కల్వర్టు చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతోంది. వర్షాకాలం ఆరంభం మొదలు మూడు, నాలుగు నెలలు ఏకంగా వరద పారుతోంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాహనదారులు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పైవంతెన నిర్మాణం ద్వారా సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మండల కేంద్రంలోని ఏళ్ల నాటి సమస్య తీరనున్నది.

మండలంలోని శివంగళపల్లి అటవీ ప్రాంతంతో పాటు మండల కేంద్రంలోని రైతుల వ్యవసాయ క్షేత్రాల నుంచి చిన్నపాటి వర్షానికి ఒర్రె పారుతోంది. వరద నీరు ప్రధాన కూడలి బస్టాండు-పోలీస్‌స్టేషన్‌ మధ్య ఉన్న ప్రధాన లోలెవల్‌ కల్వర్టు ద్వారా వర్షాకాలంలో మూడు, నాలుగు నెలలు పారుతోంది. దీంతో లోలెవల్‌ కల్వర్టు నాచు పట్టి ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు నీటిలో జారి పడిన సంఘటనలు ఉన్నాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదకు ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. పోలీసులు తాడు సహాయంతో రక్షించగా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లోలెవల్‌ కల్వర్టుపై నీరు పారడంతో ద్విచక్ర, కార్లు, ఇతర వాహనాలు నీటిలోనే నిలిచిపోవడం, మొరాయించడం పరిపాటిగా మారింది. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం చూపటానికి ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖ నిధులు రూ.35 లక్షలను కేటాయించింది. టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పనులు పారంభించారు. అయితే ఈ పనుల్లో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాక ముందే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


ఇబ్బందులు తొలగిపోతాయి

- మురళి, గ్రామస్థుడు, కోనరావుపేట

గత 50 ఏళ్లుగా చిన్నపాటి వర్షానికి లోలెవల్‌ కల్వర్టుపై నుంచి వరద పారుతోంది. దీంతో వంతెన నిర్మాణానికి పలుమార్లు నిధుల మంజూరుకు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీర్ఘకాలం తరవాత అయినా నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయి.


అంచెలంచెలుగా గ్రామాభివృద్ధి

- పోకల రేఖ, సర్పంచి, కోనరావుపేట

మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ అధ్యక్షురాలు అరుణ సహకారంతో గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాం. హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పీఆర్‌ నిధులు రూ.35 లక్షలు కేటాయించారు. ఇప్పటికే ఆడిటోరియం, మాసిన్‌ చెరువు సుందరీకరణ, రోడ్డు వెడల్పు, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు నిర్మాణాలు పూర్తి చేశాం. మండల కేంద్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్‌ నిధుల మంజూరుకు ఇటీవల హామీచ్చారు. నిధులు మంజూరు రాగానే పంచాయతీ, గ్రంథాలయ భవనాల నిర్మాణానికి కృషి చేస్తాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని