logo

గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలి

రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తెరాస గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణలు ముందుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

Published : 22 May 2022 04:19 IST

ఎమ్మెల్సీ కవిత పిలుపు


తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును సన్మానిస్తున్న ఎమ్మెల్సీ కవిత

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తెరాస గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణలు ముందుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మెట్‌పల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన కోరుట్ల నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిపై గ్రామ కూడళ్లలో కార్యకర్తలు చర్చజరపాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణా వచ్చిందే యువత కోసమని, అలాంటి యువకులకు ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. పింఛన్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ను తిట్టడమే తప్ప వేరే పనిలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు మీ ఇళ్లలోకి వస్తే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు చూపాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్‌కు పసుపు బోర్డుకు స్పైసెస్‌ బోర్డుకు తేడా తెలియదని విమర్శించారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ కత్తులు కటార్లు మాకు కూడా తిప్పడం వచ్చని, మాకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ఎంపీ అర్వింద్‌, బండి సంజయ్‌లకు సంస్కారం లేదన్నారు. ఎంపీీ కవిత హయాంలోనే మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో అభివృద్ధి జరిగిందని, సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి కార్యకర్తల సమావేశం నిర్వహించడం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును ఎమ్మెల్సీ కవిత సన్మానించారు. ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లి వేతన సవరణ జరిగేలా చూడాలని ఆర్పీలు ఎమ్మెల్సీకి వినతి ప్రతం సమర్పించారు. పుర అధ్యక్షులు, ఎంపీీపీీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మెట్‌పల్లిలో కార్యకర్తలు బహూకరించిన కత్తితో ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

జగిత్యాలలో శాశ్వత పండ్ల మార్కెట్‌గా అభివృద్ధి

జగిత్యాల ధరూర్‌క్యాంపు: జగిత్యాల చల్‌గల్‌లోని మామిడిమండీని శాశ్వత పండ్ల మార్కెట్‌గా మార్చేలా ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. చల్‌గల్‌ మండీలోని అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. కవిత మాట్లాడుతూ రూ.30 కోట్లతో సమీకృత పండ్ల మార్కెట్‌ నిర్మాణ పనులను చేపట్టగా రాష్ట్రంలోనే జగిత్యాల ప్రత్యేకస్థానం పొందుతుందన్నారు. రంగు, రుచి, నాణ్యతరీత్యా జగిత్యాల మామిడికి దిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. మండీలోని అభివృద్ధి పనులను గూర్చి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ ఎమ్మెల్సీ కవితకు వివరించారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, పురపాలక అధ్యక్షురాలు బోగ శ్రావణి, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు కె.దామోదర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు

గండి హన్మాన్‌ ఆలయంలో...

మెట్‌పల్లి గ్రామీణం: జిల్లా సరిహద్దులోని గండి హన్మాన్‌ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు గండి హన్మాన్‌ ఆలయం వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, నాయకులు సంజయ్‌తో పాటు తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గండి హన్మాన్‌ ఆలయంలో ఆమె స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు