logo

దళితబంధు దేశానికే దిక్సూచి

దళితబంధు దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం సాయంత్రం జగిత్యాల మినీస్టేడియంలో జిల్లాలోని దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Published : 22 May 2022 04:19 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్‌


యూనిట్లు అందిస్తున్న మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు

జగిత్యాల, న్యూస్‌టుడే: దళితబంధు దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం సాయంత్రం జగిత్యాల మినీస్టేడియంలో జిల్లాలోని దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఈ పథకం రూపొందించారని, ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా వందశాతం రాయితీతో రూ.10 లక్షల సాయం అందిస్తున్నామని సద్వినియోగం చేసుకుని సీఎం కేసీఆర్‌ మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. దళితుల కోసం దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నారని అనేక వ్యాపారాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించిందని దేశంలో భాజపా, కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి మాట్లాడుతూ జిల్లాలో తొలివిడత 345 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం వర్తింపజేశామని ముందుగానే యూనిట్లపై అవగాహన కల్పించి రూ.9.90 లక్షలు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ పథకం కింద వాహనాలు కొనుగోలు చేసిన వారు 10 సంవత్సరాల వరకు విక్రయించుకునే వీలులేదని పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా ఎంపికైన లబ్ధిదారులు విజయం సాధించి రాష్ట్రంలో భవిష్యత్తు దళితవర్గాలకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారని దళితబంధు లబ్ధిదారులు కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని రెట్టింపు చేయాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ దళితులు నైపుణ్యాలను మెరుగుపర్చుకునే దిశగా కృషి చేయాలని దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమన్నారు. అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ కె.లక్ష్మినారాయణ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, పురపాలక ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ బోగ శ్రావణి, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని