logo

పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు

కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ నెల 23 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా పాలనాధికారి రవి పర్యవేక్షణలో పకడ్బందీగా....

Published : 22 May 2022 04:19 IST

జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి

న్యూస్‌టుడే, మెట్‌పల్లి

కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈ నెల 23 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా పాలనాధికారి రవి పర్యవేక్షణలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, చర్యలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై డీఈవోతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.

న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లు పాఠశాలలు సరిగ్గా నడవక తీవ్ర నష్టం జరిగింది. పరీక్షలపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.?

డీఈవో: విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా కృషి చేశాం. ప్రభుత్వం 30 శాతం సిలబస్‌ తగ్గించడంతోపాటు 11 పేపర్లకు బదులు 6 పేపర్లకు కుదించింది. సిలబస్‌ త్వరగా పూర్తిచేసి జనవరి నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి. మరుసటి రోజు ఉదయం ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాం. 15 రోజులకు ఒకసారి గ్రాండ్‌ టెస్టులు, ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాం.

న్యూ: పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.?

డీఈవో: జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలో పదోతరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 11,826 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 6,150 మంది బాలురు, 5,676 మంది బాలికలు ఉన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.

న్యూ: పర్యవేక్షణకు ఎంతమందిని నియమించనున్నారు.?

డీఈవో: ప్రతి కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఉంటుంది. నిత్యం ప్రతి కేంద్రాన్ని పర్యవేక్షించేలా నాలుగు ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. వాటి నిఘా పర్యవేక్షణలో సీఎస్‌, డీవోలు ప్రశ్నాపత్రాలను తెరవాల్సి ఉంటుంది. పోలీసు స్టేషన్‌లోని ప్రశ్నాపత్రాలను గంట ముందే పరీక్ష కేంద్రానికి, అక్కడి నుంచి తపాలా కార్యాలయానికి తరలించేలా చర్యలు చేపట్టాం. బాలురు, బాలికల తనిఖీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.

న్యూ: వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.?

డీఈవో: పరీక్ష హాలులో అన్ని సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాం. వెలుతురు, ప్యాన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. తాగునీటి సౌకర్యం, ప్రతి కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బందితోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఉండదు.

న్యూ: జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఎంత మంది సిబ్బందిని నియమించారు.?

డీఈవో: జిల్లా వ్యాప్తంగా 1035 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. 67 కేంద్రాల్లో 67 మంది సీఎస్‌, 67 మంది డీవోలను నియమించాం. అధికారులు, సిబ్బందికి గుర్తింపుకార్డులు ఇస్తున్నాం.

న్యూ: ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందా.?

డీఈవో: ఒక్క నిమిషం నిబంధన లేదు. అయిదు నిమిషాల వరకు అవకాశం కల్పిస్తాం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసి కేంద్రాల్లోకి పంపిస్తాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులు చూడాలి.

న్యూ: కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి.?

డీఈవో: ప్రతి కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నెంబర్లను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని అధికారులకు సూచించాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలి.

న్యూ: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు, సలహాలు.?

డీఈవో: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్ధు పరీక్షల భయం వీడి ఆత్మవిశ్వాసంతో రాయాలి. జవాబు పత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థులు హాల్‌టికెట్‌ సంఖ్యను తప్పనిసరిగా వేయాలి. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండదు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు తెచ్చుకోవద్దు, చూచిరాతలకు పాల్పడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని