logo

కమ్ముకుంటున్న మబ్బులు.. అన్నదాతల్లో గుబులు

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. తరచుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడం అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా సాగకపోవడంతో అకాల వర్షాలు

Updated : 23 May 2022 04:16 IST

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి

రాచర్ల బొప్పాపూర్‌లో తూకాలు జరుపుతున్న హమాలీ కార్మికులు

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. తరచుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడం అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా సాగకపోవడంతో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తూకాల్లో తమవంతు కోసం కేంద్రాల్లో రోజులతరబడి పడిగాపులు పడుతున్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తుండగా మరోవైపు తాలు, తప్ప, తరుగు పేరిట మిల్లర్లు కోత విధిస్తున్నారు.


కొత్తపేట గ్రామంలో పేరుకుపోయిన ధాన్యం కుప్పలు

అటవీప్రాంత గ్రామాలపై చిన్నచూపు

అటవీ ప్రాంతంలో... ప్రధాన రహదారులకు దూరంగా విసిరేసినట్లు ఉండే చందుర్తి మండలంలోని కొత్తపేట గ్రామ రైతుల బాధలు పట్టించుకునే వారే కరవయ్యారు. చందుర్తి మండల కేంద్రానికి సుమారు 18 కి.మీల దూరంలో ఉన్న ఈ గ్రామంలో యాసంగి వరి కోతలు పూర్తై నెల రోజులు గడుస్తున్నా ఒక్క ధాన్యపు గింజనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొనలేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చందుర్తి ప్యాక్స్‌ ఆధ్వర్యంలో ఏటా ఈ గ్రామంలో ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనుగోళ్లను చేపట్టేవారు. లారీల కొరత కారణమని చెబుతూ ఇక్కడ కొనుగోళ్లను ప్రారంభించకపోవటంతో నిత్యం ధాన్యాన్ని ఆరబెట్టడం, మళ్లీ సాయంత్రం వేళల్లో కుప్పలు చేస్తూ అరిగోసలు పడుతున్నారు. గ్రామంలో సుమారు 400 ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 1500 నుంచి 2000 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. చందుర్తి మండలంలోని గ్రామమైప్పటికీ కొత్తపేట గ్రామం రుద్రంగి మండల కేంద్రానికే చేరువలో ఉంటుంది. గతంలో రుద్రంగిలోని ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరిగేవి. కొన్ని కారణాల వల్ల ఐకేపీ మహిళలు కేంద్రాల నిర్వహణ చేపట్టడం లేదు. దీంతో కొత్తపేట రైతులకు సమస్య ఉత్పన్నమైంది. గత వానాకాలం సీజన్‌ నుంచి చందుర్తి మండలంలోని మల్యాల లేదా కట్టలింగంపేట గ్రామాల్లోని ప్యాక్స్‌ ఉపకేంద్రాల ఆధ్వర్యంలో కొనుగోళ్లను చేపడుతున్నారు. గ్రామం పరిధి చాలా చిన్నది కావటంతో ఇక్కడ కొనుగోలు కోసం ఉప కేంద్రం ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారుతోంది. కనీసం గ్రామంలోని ఐకేపీ మహిళలు చొరవ తీసుకుంటే ఉపకేంద్రం ఏర్పాటు చేసే ఆస్కారం ఏర్పడుతుందని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.

పలుచోట్ల కొనుగోళ్లు అంతంతే

ఎల్లారెడ్డిపేట మండలంలో యాసంగిలో 11,736 ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగుచేశారు. ధాన్యం సేకరణకు ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈనెల 20 వరకు 510 మంది రైతుల వద్ద 35,832 ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 30,893 క్వింటాళ్లను మిల్లులకు తరలించగా మరో 20 వేల క్వింటాళ్ల ధాన్యం తూకానికి సిద్ధంగా ఉంది. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కింద 10 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 432 మంది రైతుల వద్ద 32,850 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించగా 28,959 క్వింటాళ్లను మిల్లులకు చేరవేశారు. ఇంకా కేంద్రాల్లో సుమారు 18 వేల క్వింటాళ్లను తూకం వేయాల్సి ఉంది. తిమ్మాపూర్‌ ప్యాక్స్‌ పరిధిలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసి, 190 మంది రైతుల నుంచి 14,750 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందులో నుంచి 18,800 క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు చేరవేయగా ఇంకా 20 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉంది. అల్మాస్‌పూర్‌ ప్యాక్స్‌ తరపున 8 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ 374 మంది రైతుల వద్ద 21,377 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 18వేల క్వింటాళ్లను మిల్లులకు తరలించారు. ఇంకా సుమారు 15 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉంది. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతుండగా లారీల కొరతతో మిల్లులకు రవాణాలో జాప్యం జరుగుతోంది.

వెంటనే సేకరించాలి

-దాసరి మోహన్‌, ఉపసర్పంచి, కొత్తపేట

మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మా గ్రామంలోని రైతుల ఆవేదన అరణ్య రోదనగా మారుతోంది. మండలంలోని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వెంటనే కొనుగోళ్లను చేపట్టాలి. గన్నీ సంచులు, లారీలను అందుబాటులో ఉంచాలి. నాకున్న రెండెకరాల పొలంలో దాదాపు 60 బస్తాల ధాన్యం పండింది. తూకాలకోసం ఎదురు చూస్తున్నాం.

కోతలు పూర్తై నెలరోజులు

-కొలకాని గంగమల్లయ్య, రైతు, కొత్తపేట

నాకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాను. కోతలు పూర్తై నెల రోజులవుతోంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక నిత్యం ధాన్యం కుప్పల వద్దే నిరీక్షించాల్సి వస్తోంది. వర్షాకాలం ప్రారంభం అయితే లారీలు నడవలేని విధంగా రోడ్లు పాడైపోతాయి. రైతుల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు స్పందించి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించేలా చూడాలి.

ఉపకేంద్రం ఉంటే జాప్యం జరగదు

-తిప్పని శ్రీనివాస్‌, ప్యాక్స్‌ ఛైర్మన్‌, చందుర్తి

మారుమూల ప్రాంతంలో ఉన్న కొత్తపేటకు లారీలు తీసుకురావటానికి విముఖత చూపుతున్నారు. గ్రామ స్థాయిలో ఉపకేంద్రం ఏర్పాటు చేసుకోవటం ద్వారా కొనుగోళ్లలో జరిగే జాప్యాన్ని అధిగమించవచ్చు. చందుర్తి ప్యాక్స్‌ పరిధిలో ఇప్పటికే తలకు మించిన భారంగా ఉపకేంద్రాల సంఖ్య ఉంది. కొత్తపేటలో గత వానాకాలం సీజన్‌ మాదిరిగానే కొనుగోళ్లను చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని