logo

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక

వేములవాడ పట్టణాభివృద్ధికి, భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేములవాడ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా జీఐఎస్‌ ఆధారిత మాస్టరు ప్లాన్‌ను సిద్ధం చేశామని వీటీఏడీఏ వైస్‌ ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డి తెలిపారు.

Published : 24 May 2022 04:30 IST

మాట్లాడుతున్న పురుషోత్తంరెడ్డి

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: వేములవాడ పట్టణాభివృద్ధికి, భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేములవాడ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా జీఐఎస్‌ ఆధారిత మాస్టరు ప్లాన్‌ను సిద్ధం చేశామని వీటీఏడీఏ వైస్‌ ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డి తెలిపారు. వీటీఏడీఏ మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాపై జిల్లా అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, వీటీఏడీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్లానింగ్‌ శాఖ అధికారి చంద్రిక వీటీఏడీఏ మాస్టర్‌ ప్లాన్‌ గురించి ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో సహా 6 విలీన గ్రామాలు, 7 ఆర్‌ అండ్‌ ఆర్‌ గ్రామాలను కలుపుకొని మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేశామన్నారు. లైన్‌ డిపార్ట్‌మెంట్, ఎన్‌జీవోలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి వచ్చే 40 ఏళ్ల ప్రజా అవసరాలు, అభివృద్ధిని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా, పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించేలా అన్ని అంశాలను ప్రణాళికలో పొందుపరిచినట్లు చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో వచ్చే సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై మరోసారి చర్చించి సమగ్ర మాస్టరు ప్లాన్‌ రూపొందిస్తామన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమకు ప్లాన్‌ అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలన్నారు. వేములవాడకు ఉన్న చారిత్రక ప్రత్యేకతను పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ మాట్లాడుతూ ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ మాధవి, టౌన్‌ ప్లానింగ్‌ డీడీ జగన్‌మోహన్‌, ఎంపీపీ వజ్రమ్మ, జడ్పీటీసీ సభ్యుడు మ్యాకల రవి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు