logo

బండి సంజయ్‌ ప్రజలకు చేసిందేమిటి?

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మూడేళ్ల కాలంలో ప్రజలకు చేసింది ఏమి లేదని, అసత్యపు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని మేయర్‌ వై.సునీల్‌రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల

Published : 24 May 2022 04:30 IST

మేయర్‌ సునీల్‌రావు

మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మూడేళ్ల కాలంలో ప్రజలకు చేసింది ఏమి లేదని, అసత్యపు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని మేయర్‌ వై.సునీల్‌రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజయ్‌ మానసిక ఆందోళనకు గురై  సంస్కార హీనంగా మాట్లాడుతున్నారన్నారు. ఉద్యమంతో తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంజయ్‌ చేసిన అసత్యపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు మూడేళ్లుగా దూరంగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేపట్టింది లేదన్నారు. రైతుల కోసం చేపట్టే ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని గతంలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించి ఇప్పుడు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని వివరించారు. ఈ విషయం ఎంపీ సంజయ్‌కు తెలియకపోవడం అవివేకమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని, 28 రాష్ట్రాల్లో రైతుల పట్ల ప్రేమ ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి అని చెప్పారు. రైతు వ్యతిరేక పార్టీ భాజపా అని, గుజరాత్‌ వ్యాపారులకు కొమ్ముకాయడంతో పాటు దేశంలో సంపదను వారికి దోచిపెడుతుందన్నారు. రైతుల ధాన్యాన్ని కొనబోమని భాజపా కేంద్ర ప్రభుత్వం కొర్రీ పెట్టినా రైతులు నష్టపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనుగోలు చేస్తున్నారని వివరించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో పెట్రోల్‌, డీజిల్‌పై ఎప్పుడు వ్యాట్‌ పెంచలేదని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న సెస్‌ను ఇప్పటికీ అమలు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలోని నిరంకుశ పాలనకు సీఎం కేసీఆర్‌ వ్యతిరేక పోరాటం మొదలు పెట్టారని, సీఎం దిల్లీ పర్యటనతో భాజపా పీఠం కదులుతుందనే భయంతో ఆపార్టీ నాయకులు ఇష్టాురీతిగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అసరా పింఛను కోసం ఏడాదికి రూ.12వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే కేంద్రం వాటా రూ.240 కోట్లు మాత్రమే అని, పింఛన్లలో కేంద్రం వాటా ఎంతో బండి సంజయ్‌ గమనించాలని సూచించారు. సంజయ్‌తో పాటు భాజపా నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసత్యపు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని తెలిపారు. సమావేశంలో తెరాస పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని