logo

కొండగట్టుపై భక్తజన సందడి

కోరిన కోర్కెలు తీర్చే అంజన్న కొండపై కొండంత పండుగ సందడి నెలకొంది. ఆలయంలో సోమవారం నుంచి పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Published : 24 May 2022 05:32 IST

ఉత్సవమూర్తులకు హారతి ఇస్తున్న అర్చకుడు

కొడిమ్యాల, న్యూస్‌టుడే: కోరిన కోర్కెలు తీర్చే అంజన్న కొండపై కొండంత పండుగ సందడి నెలకొంది. ఆలయంలో సోమవారం నుంచి పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారికి పట్టువస్త్రాలను ఎమ్మెల్యే దంపతులు తీసుకురాగా ఆలయ అర్చకులు, అధికారులు కొండపై గల ‘వై’ జంక్షన్‌ నుంచి ఎదుర్కొని ఆలయం వరకు కొండగట్టు వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా తెలంగాణ కళాకారుల నృత్యాల నడుమ తీసుకొచ్చారు. మల్లయ్య కళాబృందంచే 108 దీపాల ప్రదర్శన, గడ్డం వెంకటయ్య బృందంచే యక్షగానం, కచ్చు అంజయ్య బృందంచే ఒగ్గుడోలు ప్రదర్శన, సంగెం రాధాకృష్ణన్‌ బృందంచే బోనాలు, చిరంజీవి, శారదా బృందాలచే కోలాటం, శ్రీనివాస్‌ బృందంచే చెక్కభజన, సిద్దుల సక్కుబాయి, గుండు వనజ బృందాలచే బతుకమ్మ ప్రదర్శన, ముత్యంపేట సంజీవ్‌ బృందంచే డప్పు నృత్యం ప్రదర్శన, గడ్డం ఈశ్వరయ్య శివపార్వతి కళామండలిచే మయరావణ చరిత్ర వేషధారణలు, భజన బృందాల భక్తి సంకీర్తనలతో శోభాయాత్రగా తీసుకువచ్చారు. మహిళలు పాటలు పాడుతూ కోలాటం, నృత్యాలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, చిందు కళాకారుల శ్రీసీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారి వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలువురు భక్తులు భక్తిపారవశ్యంతో నృత్యాలు చేశారు. ఆలయ ఈవో వెంకటేష్‌, ఆలయ ట్రస్టీ ఛైర్మన్‌ మారుతిస్వామి, భద్రాచలం ఆలయ పర్యవేక్షకులు కిషోర్‌, జడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్‌రావు, స్థానిక సర్పంచి తిరుపతిరెడ్డి, మల్యాల, కొడిమ్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుదర్శన్‌, పి.కృష్ణారావు, సింగిల్విండో ఛైర్మన్‌ ఎం.రాజనర్సింగరావు, ఆలయ ఏఈవో శ్రీనివాస్‌, ప్రధానార్చకులు జితేంద్రస్వామి, రామక్రిష్ణ, రఘు, ఉపప్రధానార్చకులు చిరంజీవి, స్థానాచార్యులు కపీందర్‌, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

600 మందితో బందోబస్తు

మల్యాల, న్యూస్‌టుడే: కొండగట్టు అంజన్న ఆలయంలో మూడు రోజుల పాటు జరగనున్న హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం డీఎస్పీ ప్రకాశ్‌ పర్యవేక్షణలో 600 మంది పోలీసు సిబ్బందితో ఆలయ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్యాల సీఐ రమణమూర్తి తెలిపారు. 10 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, మిగిలినవారు వివిధ హోదా సిబ్బంది ఉత్సవాలు ముగిసే వరకు విధులు నిర్వర్తిస్తారని వివరించారు. ముఖ్యంగా మాల విరమణ తర్వాత బారికేడ్ల మధ్య నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో ఎలాంటి తోపులాట జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని