logo

ఉపాధి కోసం వచ్చి... మృత్యుఒడికి చేరి...

బతుకుదెరువు కోసం సొరంగం పనులు చేయడానికి వచ్చిన వలస కార్మికుల్లో ఒకరిని రాయి రూపంలో మృత్యు కబళించగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఊహించని సంఘటనతో జిల్లా

Published : 25 May 2022 02:39 IST

సొరంగం పనుల్లో వలస కార్మికుడి దుర్మరణం

ప్రమాదం చోటుచేసుకున్న అడిట్‌-2 సొరంగం

కోనరావుపేట, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం సొరంగం పనులు చేయడానికి వచ్చిన వలస కార్మికుల్లో ఒకరిని రాయి రూపంలో మృత్యు కబళించగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఊహించని సంఘటనతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. కోనరావుపేట మండలంలోని మల్కపేట కాళేశ్వరం ఎత్తిపోతల 9వ ప్యాకేజీ సొరంగం పనులు కొనసాగుతున్నాయి. 12 కిలో మీటర్ల సొరంగం నిర్మాణ పనులు చేస్తుండగా గత సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరింది. దీంతో మూడు నెలల పైగా ముంపులోనే ఉండటంతో పనులు నిలిచిపోయాయి. మర్తన్‌పేట శివారులో అడిట్‌-2 వద్ద మిగిలిన కిలో మీటరు సొరంగం లైనింగ్‌ పనులను పూర్తి చేయటానికి అధికారులు, గుత్తేదారు ఝార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులతో దశల వారీగా (షిప్టు) పనులు చేయిస్తున్నారు. లైనింగ్‌ పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు భావించి ఆ దిశగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు పైనుంచి ఒక్కసారిగా రాయి ముగ్గురిపై పడింది. ప్రమాదంలో యేగేందర్‌ మోహతా (24) మృతి చెందాడు. మరో ఇద్దరు కార్మికులు ఉమేశ్‌కుమార్‌, అవెల్‌ తోప్రా గాయపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో 8 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం సొరంగం పనుల నిమిత్తం వచ్చారు. ఊహించని ఘటనతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. లైనింగ్‌ పనుల్లో కార్మికుల  రక్షణకు నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడికి, గాయపడ్డ వారికి తగిన పరిహారం అందించాలని తోటి కార్మికులు డిమాండు చేస్తున్నారు.


తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ ఆదేశం

సిరిసిల్ల (విద్యానగర్‌): కోనరావుపేట మండలం మర్తన్‌పేట అండర్‌ టన్నెల్‌లో అడిట్-2 కింద 12వ కిలోమీటర్‌ వద్ద జరిగిన ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. ఘటన వివరాలను ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాక్‌ ఫెల్లింగ్‌(రాయి పడటంతో) ఘటనలో ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు గాయపడ్డారని ఈఈ తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో యేగేంద్ర కుమార్‌ మోహతా చనిపోయారని తెలిపారు. మిగతా ఇద్దరినీ కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్‌కు ఆదేశించారు. ఖర్చుకు వెనుకాడకుండా ఇద్దరు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని