logo

మద్యం సేవించి విధులకు హాజరైన పీఈటీపై సస్పెన్షన్‌ వేటు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలోని 10వ తరగతి పరీక్ష కేంద్రంలో మద్యం సేవించి ఇన్విజిలేషన్‌ విధులు నిర్వర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వేముల రవికుమార్‌ను సర్వీసు నుంచి సస్పెండ్‌

Published : 25 May 2022 02:39 IST

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలోని 10వ తరగతి పరీక్ష కేంద్రంలో మద్యం సేవించి ఇన్విజిలేషన్‌ విధులు నిర్వర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వేముల రవికుమార్‌ను సర్వీసు నుంచి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. మాస్‌ కాపియింగ్‌ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో మంగళవారం ఆయన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. మద్యం సేవించి విధులకు హాజరైన రవికుమార్‌ను గమనించిన డీఈవో అతన్ని మందలించడంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌.ఐ. సీనానాయక్‌ వచ్చి బ్రీతింగ్‌ ఎనలైజర్‌ పరీక్ష చేయగా 112 శాతం నమోదైంది. మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో రవికుమార్‌ను సర్వీసు నుంచి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.  పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సమయంలోనే కొందరు కిటికీల నుంచి చీటిలు వేయడాన్ని గమనించిన డీఈవో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆసియా, డిపార్ట్‌మెంటల్‌ అధికారి స్వామిరావును విధుల నుంచి తప్పించినట్లు డీఈవో ప్రకటనలో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన రవికుమార్‌ హుజూరాబాద్‌ మండలం రాంపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని