logo

ఆరోగ్య కేంద్రంగా రామగుండం

రాష్ట్ర ప్రభుత్వ చొరవ, స్థానిక పరిశ్రమల సహకారంతో రామగుండం ప్రాంతం ఆరోగ్య కేంద్రం(మెడికల్‌ హబ్‌)గా ఏర్పడుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7.5 కోట్లతో

Published : 25 May 2022 02:39 IST

ప్రభుత్వం, పరిశ్రమల సహకారంతో అభివృద్ధి : ఎమ్మెల్యే చందర్‌

సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ చొరవ, స్థానిక పరిశ్రమల సహకారంతో రామగుండం ప్రాంతం ఆరోగ్య కేంద్రం(మెడికల్‌ హబ్‌)గా ఏర్పడుతోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.7.5 కోట్లతో ఆస్పత్రి భవనంపైన నిర్మించిన మరో అంతస్థును మంగళవారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతానికి వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య, వైద్యేతర పరికరాలను సమకూర్చడంతో పాటు మరో అంతస్థు నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోగా వైద్య కళాశాల భవన నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం రూ.500 కోట్లు కేటాయించడం హర్షదాయకమన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాల కోసం రామగుండం నగరపాలక సంస్థ నుంచి రూ.65 లక్షలు కేటాయించారన్నారు.. ఎన్టీపీసీ(హెచ్‌.ఆర్‌.) ఉన్నతాధికారిణి విజయలక్ష్మీ మురళీధరన్‌ మాట్లాడుతూ ఎన్టీపీసీ నిధులతో ఇంత చక్కటి భవన నిర్మాణం తమకెంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఎన్టీపీసీ జీఎం(ఓఅండ్‌ఎం) అతుల్‌ కమలాకర్‌ దేశాయ్‌, నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు ఆముల నారాయణ, స్థానిక కార్పొరేటర్‌ నగునూరి సుమలత, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌, ఎన్టీపీసీ అధికారులు డాక్టర్‌ లేహర్‌, డి.ఎస్‌.కుమార్‌తో పాటు పలువురు వైద్యులు, వైద్య కళాశాల, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి భవన ప్రారంభ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సభా వేదికపై కనిపించకపోవడం గమనార్హం.  ముందుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేశారు. .

‘అభివృద్ధి గిట్టకనే ఆరోపణలు’
రామగుండం ప్రాంతాభివృద్ధి గిట్టని కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయడం ఈ ప్రాంతంలోని కొందరు నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వైద్య కళాశాల భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా డిగ్రీ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిగ్రీ విద్యార్థులను తప్పుదోవ పట్టించి వారిచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేయించిన ఘనత వారికే దక్కుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని