logo

నగరం కాషాయమయం

కరీంనగర్‌ నగరం కాషాయమయంగా మారింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రకు భారీఎత్తున హిందు యువత, మహిళలు తరలివచ్చారు.

Published : 26 May 2022 04:07 IST

ఘనంగా హిందూ ఏక్తాయాత్ర


యాత్రలో శ్రీరాముడి భారీ విగ్రహం

కరీంనగర్‌ సాంస్కృతికం, ముకరంపుర, తెలంగాణ చౌక్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరం కాషాయమయంగా మారింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రకు భారీఎత్తున హిందు యువత, మహిళలు తరలివచ్చారు. ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. గాంధీరోడ్డు నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు యువత కాషాయ జెండాలను రెపరెపలాడించారు. కేరళ వాయిద్యాలు, కళాకారుల వేషధారణ ఆకట్టుకుంది. హనుమాన్‌, శ్రీరామ భారీ విగ్రహాల ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అన్నీ తానై నిర్వహించిన ఈ శోభాయాత్రలో బండి సంజయ్‌ హిందూ సమాజాన్ని సంఘటితం చేసే దిశగా పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రావాలంటే బండి సంజయ్‌ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఏక్తాయాత్ర వైశ్యభవన్‌ నుంచి రాజీవ్‌చౌక్‌, టవర్‌ సర్కిల్‌, శాస్త్రీరోడ్డు, కమాన్‌, బస్టాండ్‌, తెలంగాణ చౌక్‌, మహిళా కళాశాల మీదుగా మళ్లీ రాజీవ్‌ చౌక్‌ నుంచి తిరిగి వైశ్యభవన్‌ చేరుకుంది. దారి పొడవునా భారత్‌మాతాకీ జై.. జై శ్రీరాం.. జై బోలో హనుమాన్‌కి అంటూ నినాదాలతో మారుమోగించారు. కార్యక్రమంలో ప్రారంభ పూజ నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాసశర్మ నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, జయశ్రీ, భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మోరం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభంలో అభిమానులు, కార్యకర్తలు భారీ గజమాలతో బండి సంజయ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. యాత్రపై పలువురు ముస్లింలు పూలు చల్లారు.

మాట్లాడుతున్న బండి సంజయ్‌

భారీ బందోబస్తు

యాత్రకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌ పర్యవేక్షించారు. ఆరుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలు, 450 మంది ఇతర సిబ్బంది బందోబస్తుకు నియమించారు.  రాజీవ్‌చౌక్‌ వద్ద పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ పరిశీలించారు.

నగరంలోని కమాన్‌ కూడలిలో ఏక్తాయాత్రకు హాజరైన జనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని