logo
Published : 26 May 2022 04:07 IST

పురపాలిక.. ఆటలకు వేదిక

జూన్‌ 2న క్రీడా ప్రాంగణాలు ప్రారంభించేలా కార్యాచరణ
ఎకరం స్థలం తప్పనిసరి


పురపాలకశాఖ సూచించిన క్రీడా ప్రాంగణం నమూనా

న్యూస్‌టుడే-కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరాలు, పట్టణాల్లో క్రీడా మైదానాలు కనుమరుగవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఒకటెండ్రు ఉన్నా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. పిల్లలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు వీలుగా వార్డులు, గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన పట్టణ, పల్లె ప్రగతి నిర్వహణ సమావేశంలో ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.

కరీంనగర్‌, రామగుండం నగరపాలికలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ముమ్మరం చేశారు. కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీలో భాగంగా ఏటా నగరపాలక సంస్థ తరఫున క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దీనికోసం రూ.10లక్షలు కేటాయించారు. క్రీడాశాఖ మైదానంలో శిక్షణ ఇస్తుండగా ఎప్పటికీ నగరపాలికలోనే క్రీడలను నిర్వహించుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రత్యేకంగా విభాగం చేసి క్రీడలను ప్రోత్సహించేలా డిప్యూటేషన్‌పై కోచ్‌లను నియమించుకోవాలని భావించి క్రీడా మైదానాలు అన్వేషిస్తున్న సమయంలోనే పట్టణ ప్రగతి కార్యక్రమంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వడంతో నగరపాలకకు మార్గం సులభమైంది.

తెలంగాణ క్రీడా ప్రాంగణం(టీకేపీ-అర్బన్‌) పేరుతో ప్రతీ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణలు నిర్మించేందుకు వార్డుల వారీగా లక్ష్యాన్ని విధించారు. కనీసం ఒక వార్డుకు మూడు ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో పేరుగాంచిన ఐదు క్రీడలకు సరిపడా మైదానం ఒకే చోటా ఉండేలా ఎకరం స్థలం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని పురపాలికలకు సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ  ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌ జంప్‌ పిట్‌, వ్యాయమం చేసేందుకు సింగిల్‌, డబుల్‌ బార్‌ ఉండేలా, వీటికి మైదానాలు ఎంతమేర ఉండాలనే విషయాలతో మార్గదర్శకాలు, డిజైన్‌ విడుదల చేశారు. దీంతో పాటు చుట్టూ మొక్కలను పెంచాలి. వచ్చే నెల 2లోగా నగరంలో నిర్ణయించిన టార్గెట్‌ ప్రకారం మైదానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర పరిధిలో ముందుగా గుర్తించిన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. ఈ మేరకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తామని ప్రకటించారు.

ప్రతీ వార్డు, డివిజన్‌లో మైదానం

ప్రభుత్వ ఆదేశాల మేరకు పుర, నగరపాలికల్లోని అన్నీ వార్డులు, డివిజన్లలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి అవసరమున్నంత మేరకు దీనికోసం తీసుకునే అవకాశముంది. విలీన కాలనీల్లో ఎక్కువగా స్థలాలు ఉండగా అక్కడ ఎలాంటి సమస్యలుండవు. పెద్ద మున్సిపాలిటీల్లో స్థలం దొరకడం గగనమే. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలకవర్గ సభ్యులు, అధికారులు ఆలోచన చేయాలి. వీటిని ఏర్పాటు చేయడంతోనే క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.50వేలు ఇవ్వనుంది. క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారుల నుంచే కమిటీ ఉంటుంది. కమిటీ పర్యవేక్షణలోనే క్రీడా ప్రాంగణలు, క్రీడలు ఉంటాయి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని