logo

లారీలు రాక... కాంటాలు కాక

ఈ ధాన్యం బస్తా వద్ద కూర్చొన్న మహిళా రైతు పేరు కొంపల్లి లచ్చవ్వ. ఈమెది వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైంది. తేమ శాతం వచ్చినా లారీల కొరత కారణంగా కాంటా పెట్టలేదు. దీంతో రోజూ కుప్పను చూస్తూ ఇలా చెట్టు కింద కూర్చొంటుంది.

Published : 26 May 2022 04:07 IST
కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
వేములవాడలోని కేంద్రంలో ధాన్యం బస్తాలు
న్యూస్‌టుడే, వేములవాడ

ధాన్యం బస్తా వద్ద కూర్చొన్న మహిళా రైతు పేరు కొంపల్లి లచ్చవ్వ. ఈమెది వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైంది. తేమ శాతం వచ్చినా లారీల కొరత కారణంగా కాంటా పెట్టలేదు. దీంతో రోజూ కుప్పను చూస్తూ ఇలా చెట్టు కింద కూర్చొంటుంది. లచ్చవ్వనే కాదు ఇలా చాలా మంది అన్నదాతలు ధాన్యం కాంటాలు కాక పడిగాపులు కాస్తున్నారు.


రుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా కేంద్రాల్లో లారీలు రాకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కాంటాలు పెట్టడం లేదు. దీంతో కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలు, కాంటాలైన బస్తాలు పేరుకుపోయాయి. పలు దఫాలుగా కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన రైతులకు రోజూ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

జిల్లాలో యాసంగిలో 1.18 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సింగిల్‌ విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్‌, మెప్మా ద్వారా 265 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తూకాలైన బస్తాలను మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలు, ఇతర వాహనాల కొరత కారణంగా చాలా కేంద్రాల్లో బస్తాలు పేరుకుపోతున్నాయి. మరోవైపు వర్షాల భయం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. తూకాలైన బస్తాలపై టార్పాలిన్‌ కవర్లు కప్పి పెట్టారు. లారీలు వస్తే మిల్లులకు తరలించేందుకు ఎదురుచూస్తున్నారు. మరో వైపు కాంటాలు కాక రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు పడుతున్నారు.

వారం రోజులుగా నిరీక్షణ...

లారీల కొరతతో కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కాంటాలు కావడం లేదు. ఫలితంగా రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద వారం రోజులుగా నిరీక్షిస్తున్నారు. చాలా చోట్ల  రోజుల తరబడి కుప్పలు కాంటాలకు నోచుకోవడం లేదు. జిల్లాలో రోజూ 270 నుంచి 280 వరకు లారీల ధాన్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రైసు మిల్లుల యజమానులు సకాలంలో లారీల నుంచి ధాన్యం బస్తాలను దింపుకోవడం లేదు. దీనివల్ల మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయి ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యంతో కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిల్వలు, కాంటాలైన బస్తాలు పేరుకుపోతున్నాయి. మిల్లుల్లో నిల్వలుండటంతో మిల్లుల యజమానులు ధాన్యం దింపుకునేందుకు వెనుకంజ వేస్తునట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్కొక్క కేంద్రంలో దాదాపు రెండు, మూడు లారీల ధాన్యం బస్తాలు నిల్వ ఉన్నట్లు కర్షకులు పేర్కొంటున్నారు. ధాన్యం కాంటాలు పెడితే సమస్యలు ఎక్కువ అవుతుందని కేంద్రాల నిర్వాహకులు లారీల రాకను బట్టి తూకాలు వేస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కుప్పల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.


కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు
- హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల మేనేజరు

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు లారీల కొరత లేకుండా చూస్తున్నాం. జిల్లాలో ప్రతి రోజు 185 లారీల్లో ధాన్యం లోడ్‌ చేసి మిల్లులకు తరలిస్తున్నాం. లారీలతో పాటు డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్లను ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని