logo
Published : 26 May 2022 04:26 IST

ప్రగతి తప్పిన పారిశుద్ధ్యం

మూలనపడ్డ వాహనాలు.. నిధులు నిష్ఫలం


రోడ్లు ఊడ్చే యంత్రం

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: నిధులు వచ్చాయా.. కొనుగోలు చేశామా... మూలన పడేశామా... అన్నట్లుంది రామగుండం నగరపాలకవర్గం తీరు.. తమకు రావాల్సిన కమీషన్‌ వస్తే చాలు.. కొనుగోలు చేసిన యంత్రాలు ఏమైపోతే ఏంటన్న తరహాలో వ్యవహరిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. గతేడాది పట్టణ ప్రణాళికలో యంత్రాల కొనుగోలుకే అధిక నిధులను కేటాయించిన నగరపాలిక వాటిని వినియోగించుకోవడం లేదు. నిర్వహణ ఖర్చు ఎక్కువవుతుందని కొన్నింటిని, తక్షణ మరమ్మతులు చేయించలేక కొన్నింటిని మూలన పడేశారు. యంత్రాలను కొనుగోలు చేసేటప్పుడే నిర్ణీత కాలం పాటు వారంటీ ఉంటుంది. అదీ కాకుండా నిర్వహణ బాధ్యతను మరో సంస్థకు అప్పగించారు. ఈ రెండు విధానాల్లో యంత్రాల నిర్వహణలో బల్దియా విఫలమవుతోంది. తాజాగా జూన్‌ 2వ తేదీ నుంచి ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలోనైనా గత పట్టణ ప్రగతిలో కొనుగోలు చేసిన యంత్రాలను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. నగరపాలికలో కొనుగోలు చేసి మూలనపడేసిన యంత్రాల తీరిలా..

పుష్కరకాలంగా నిరుపయోగం

నీటి సరఫరాలో విద్యుత్తు అంతరాయాలను అధిగమించాలనే లక్ష్యంతో సుమారు రూ.కోటి వ్యయంతో 440 కేవీ సామర్థ్యం గల రెండు జనరేటర్లను పన్నెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఒకటి గోదావరి ఒడ్డున హెడ్‌ వర్క్సు వద్ద, మరొకటి శారదానగర్‌లోని ప్రధాన ట్యాంకు వద్ద ఏర్పాటు చేశారు. వినియోగిస్తే డీజిల్‌ బిల్లులే తడిసిమోపెడవుతాయని భావించిన నగరపాలిక వినియోగంలోకి తేలేదు.


అవసరం లేకపోయినా..

నగరంలోని రహదారులు సరిగా లేనందున తోపుడు బండ్లతో చెత్త సేకరణ సాధ్యం కాదని స్థానిక అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా తొమ్మిదేళ్ల క్రితం రూ.15 లక్షలతో 80 తోపుడు బండ్లు, మరో 10 లక్షలతో 1360 చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. కమీషన్ల కోసమే ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. తోపుడు బండ్లు స్టోర్‌ రూమ్‌కే పరిమితం కాగా చెత్త డబ్బాల్లో కొన్నింటిని వివిధ కార్యక్రమాల్లో నీటి నిల్వల కోసం వినియోగిస్తున్నారు.


హుక్‌ హోల్డర్‌ వాహనం

చెత్త నిర్వహణ కేంద్రంలో చెత్తతో నింపిన కంపాక్టర్లను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు వీలుగా రూ.45 లక్షలు వెచ్చించి హుక్‌ హోల్డర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. కంపాక్టర్లనే వినియోగించకపోవడంతో ఇక హుక్‌ హోల్డర్‌ వాహనానికి పనిలేక మూలన పడింది.


వేగంగా రోడ్లు ఊడ్చేందుకని..

నగరంలోని రోడ్లను కార్మికులకంటే వేగంగా ఊడుస్తుందనే భావంతో రూ.65 లక్షల వ్యయంతో రోడ్లు ఊడ్చే యంత్రాన్ని కొనుగోలు చేసిన నగరపాలక అధికారులు నెల రోజులకు మించి వినియోగించలేదు. అందులో రెండు సార్లు మొరాయించింది. దీంతో యంత్రాన్ని మూలన పడేశారు. కార్మికులతోనే రహదారులను శుభ్రం చేయిస్తున్నారు.


చెత్త సేకరించేందుకని..

రహదారుల పక్కన చెత్తను ట్యాంకులో వేసుకొని నగరానికి దూరంగా తరలించేందుకు రూ.23.5 లక్షలతో లిట్టర్‌ పిక్కర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఒకరు వాహనాన్ని నడిపిస్తుండగా మరో ఇద్దరు పైపును పట్టుకోవాలి. దీంతో యంత్రం వినియోగం కంటే కార్మికులతో చెత్త ఎత్తించడమే ఉత్తమమనుకున్న బల్దియా వారం రోజుల్లోనే యంత్రాన్ని మూలన పడేశారు.


మొబైల్‌ బయో టాయ్‌లెటు

ఏడాదిలో ఒకటి రెండు సార్లు జరిగే ఉత్సవాల్లో ఏర్పాటు చేసేందుకు పట్టణ ప్రగతి నిధులతో రెండు మొబైల్‌ బయో టాయెలెట్‌ వాహనాలను కొనుగోలు చేశారు. సుమారు రూ.50 లక్షలతో బస్సును తయారు చేయించినప్పటికీ నగరపాలక కార్యాలయం దాటి బయటకు వెళ్లలేదు. వినియోగం లేకపోవడంతో యంత్రాలు తుప్పుపట్టే పరిస్థితులు నెలకొన్నాయి.


చెత్త తరలింపులో కీలకంగా..

నగరంలో సేకరించిన చెత్తను కంపాక్టు చేసి తరలించేందుకు వీలుగా ఒక్కొక్కటి రూ.35 లక్షల వ్యయంతో రూ.70 లక్షలతో మినీ కంపాక్టర్లను కొనుగోలు చేశారు. ఒకటి గౌతమినగర్‌లో మరొకటి మల్కాపూర్‌లోని చెత్త నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు వినియోగంలోకి తేలేదు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts