logo

రైలు టిక్కెట్‌.. సులభంగా పొందేలా..

జనరల్‌ టికెట్‌పై ప్రయాణించే వారు రైల్వే స్టేషన్లో చాంతాడంతా వరుసలో ఉండి ఇబ్బందులు పడేవారు.. ఓ దశలో ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయేది.. ఈ సమస్యకు రైల్వేశాఖ చెక్‌ పెట్టింది. రైల్వే స్టేషన్లో సంస్థ అధికారులు ప్రయాణికులకు సాధారణ

Updated : 28 May 2022 06:32 IST

అందుబాటులోకి క్యూఆర్‌ కోడ్‌ సేవలు

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: జనరల్‌ టికెట్‌పై ప్రయాణించే వారు రైల్వే స్టేషన్లో చాంతాడంతా వరుసలో ఉండి ఇబ్బందులు పడేవారు.. ఓ దశలో ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయేది.. ఈ సమస్యకు రైల్వేశాఖ చెక్‌ పెట్టింది. రైల్వే స్టేషన్లో సంస్థ అధికారులు ప్రయాణికులకు సాధారణ టిక్కెట్‌ను సైతం యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా పేద, మధ్యతరగతి ప్రయాణికులు జనరల్‌ టిక్కెట్లను సులువుగా పొందడమెలాగో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితులు దాటిన అనంతరం భారత రైల్వే శాఖ ఇటీవల ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లకు జనరల్‌ బుకింగ్‌ ద్వారా టిక్కెట్లను తీసుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించింది. సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు ఇంకా టిక్కెట్‌ రిజర్వేషన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే యూటీఎస్‌(అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెటింగ్‌ సిస్టం) యాప్‌ సాయంతో సాధారణ, సీజనల్, ప్లాట్‌ఫాం టిక్కెట్లను పొందే వెసులుబాటు కల్పించారు. 

ప్రయాణికులకు అవగాహన

యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌పై కరీంనగర్‌ రైల్వే అధికారులు స్టేషన్‌లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి యాప్‌ గురించి వివరిస్తున్నారు. స్టేషన్‌ పరిసరాల్లో క్యూఆర్‌ కోడ్‌ పేపర్లు, స్టాండ్లకు అంటించారు. స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలో మీటర్ల లోపు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చని, ఎక్కువ సమయం వరుస(క్యూ)లో నిలబడకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి సులభంగా పొందవచ్చని చెబుతున్నారు. యాప్‌లోని ఆర్‌-వ్యాలెట్‌లో రూ.100 రీఛార్జి చేయించుకుంటే రూ.3 అదనంగా వస్తాయని పేర్కొంటున్నారు. 

తీసుకోవడం ఇలా..

* యూటీఎస్‌ యాప్‌ను చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. హోం పేజీలో సాధారణ బుకింగ్‌తో పాటు క్యూఆర్‌ బుకింగ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.  

* జర్నీ బై క్యూఆర్‌ ఎంచుకొని రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఏదైనా క్యూఆర్‌ కోడ్‌ పేపరును స్కాన్‌ చేయాలి. 

* ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది నమోదు చేయాలి. ప్రయాణికుల సంఖ్యను బట్టి టిక్కెట్‌ ఛార్జీ చూపిస్తుంది. 

* డబ్బుల చెల్లింపునకు గూగుల్‌ పే, పోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ ఆప్షన్లను ఎంచుకొని ఆర్‌-వ్యాలెట్‌ రీఛార్జ్‌ చేసుకొని డబ్బులు చెల్లించాలి. 

* పేపర్‌ లెస్‌ టిక్కెట్‌ ఎంచుకొంటే టిక్కెట్‌ జనరేట్‌ అయి బుకింగ్‌ అయినట్లు యాప్‌లో చూపిస్తుంది. 

* ఈ టిక్కెట్‌ను చెకింగ్‌కు వచ్చే అధికారి(టీసీ)కి చూపితే సరిపోతుంది. దీన్ని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం కాని, వేరొకరు వినియోగించుకునే వీల్లేకుండా రూపొందించారు.

వేచి ఉండాల్సిన అవసరం లేకుండా: నల్లవెల్లి దేవేందర్, చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్, కరీంనగర్‌

రైల్వే ప్రయాణికులు జనరల్‌ బుకింగ్‌ కేంద్రం వద్ద ఎక్కువ సమయం క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్, విండోస్‌ చరవాణి యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జనరల్, సీజనల్, ప్లాట్‌ఫాం టిక్కెట్లను సులభంగా బుక్‌ చేసుకోవడం కోసం అవగాహన కల్పిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని