logo
Published : 24 Jun 2022 04:25 IST

పోడు పోరు... హరితహారానికి అడ్డు

అటవీ ప్రాంతంలో గిరిజనుల ఆటంకాలు

జిల్లాలో 500 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు సిద్ధం

మరిమడ్లలోని కొండంచెరువు సమీపంలో

మొక్కలు నాటేందుకు చదును చేసిన నేల

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: న్యూస్‌టుడే, కోనరావుపేట: ఉమ్మడి జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంతమున్నది రాజన్న సిరిసిల్లలోనే. వేగంగా అటవీ ప్రాంతం క్షీణిస్తున్నది కూడా ఇక్కడే. జిల్లాలో 379.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించింది. అందులో 18.78 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. హరితహారంలో దీనిని 33 శాతానికి పెంచాలని మొక్కలు నాటుతున్నారు. కాగా ప్రతి ఏటా పోడు దారులు హరితహారానికి అడ్డుపడుతున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 500 హెక్టార్లలో అయిదు లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే వీర్నపల్లి, గంభీరావుపేట, కోనరావుపేట మండలాల్లో అటవీ అధికారులను అడ్డుకున్నారు. మరోవైపు పోడు భూముల హక్కుపత్రాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లే అధికారులకు ఆటంకాలు తప్పేలా లేవు.

ఆక్రమణలోని అటవీ ప్రాంతాల్లో హరితహారానికి రంగం సిద్ధమవుతోంది. గతేడాది ఆక్రమణలోని 1,200 హెక్టార్ల అటవీ భూములను అధికారులు గుర్తించారు. ఇక్కడ హరితహారానికి సిద్ధమవుతున్న తరుణంలో గిరిజనులు అడ్డు తిరుగుతున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నామని, ఇప్పుడు వ్యవసాయం వద్దంటే ఎలా అని పోడుదారులు ఆందోళనకు దిగుతున్నారు. హద్దులు చూపించి పట్టాలు ఇస్తే అంతలోనే వ్యవసాయం చేసుకుంటామని గిరిజనులు చెబుతున్నారు. కాగా అటవీ అధికారులు గతంలో చూపించిన భూమి కాకుండా ఏటా కొంత చదును చేసుకుంటూ పోతుండటం.. కొన్ని చోట్ల ఏకంగా చెట్లను నరికేసి మరీ పోడుకు తెగబడుతున్నారంటున్నారు. పోడు హక్కుల పత్రాల పంపిణీ ఎటూ తేలకపోవడంతో ఈ ఏడాది మరింత జఠిలంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే వీర్నపల్లి, గంభీరావుపేట, కోనరావుపేట మండలాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

అధికారుల ఉదాసీనత

జిల్లాలో అటవీప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికి మైదాన ప్రాంతాలుగా చేయడం.. తర్వాత రాత్రికి రాత్రి ట్రాక్టర్లతో చదును చేయడం, అదను చూసి పత్తి విత్తనాలు నాటడం, వీటన్నింటిని అరికట్టాల్సిన అధికారులు తొలుత గిరిజనులకు వత్తాసు పలుకుతూ వచ్చారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనుల నుంచి ఏటా మామూళ్లు వసూలు చేస్తూ చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఉదాసీనత ఇప్పుడు వారిపైనే తిరగబడే స్థాయికి చేరింది.

* రుద్రంగి మండలం మానాలలో హరితహారం ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇక్కడి అటవీ ప్రాంతంలో అధికారులు అడుగుపెట్టేందుకు సాహసం చేయరు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల గంభీరావుపేట మండలం గజసింగారంలో అటవీశాఖ నర్సరీ ఏర్పాటుకు హద్దులు గుర్తించారు. అంతలోనే పక్కనున్న రైతు ట్రాక్టర్‌తో దున్ని సాగుకు సిద్ధం చేశారు. ఇది గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

* చందుర్తి మండలం మూడపల్లి, సనుగులలో అడవి సమీపంలో చెట్లను నరికి ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. గతేడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులకు గ్రామస్థులకు గొడవ జరగడంతో వెనుదిరిగారు. ఇక్కడ అటవీ, రెవెన్యూ భూ వివాదం అపరిష్కృతంగా ఉంది.

* వీర్నపల్లి మండలంలో బాబాయిచెరువుతండా, బావుసింగ్‌నాయక్‌ తండా ఉమ్మడి పంచాయతీగా ఉన్నపుడు రెండు తండాలకు చెందిన గిరిజనులు 90 ఎకరాల్లో పోడు భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు. పంచాయతీలు వేరయ్యాక ఈ మొత్తం అటవీ భూమి బాబాయిచెరువుతండా పరిధిలోకి వెళ్లింది. దీంతో ఆక్రమణలు గుర్తించేందుకు వచ్చిన అటవీ అధికారులకు, రెండు గ్రామాల గిరిజనులకు ఏటా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గర్జనపల్లి, తుమ్మలకుంట, పొట్టిగుట్ట ప్రాంతాల్లో 150 ఎకరాలు, వన్‌పల్లి కేలోతుతండాలో 30 హెక్టార్లు, అడవిపదిరలో పది హెక్టార్లు అటవీ భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఇక్కడికి అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు వెళ్లిన ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

* కోనరావుపేట మండలం మర్రిమడ్ల, శివంగళపల్లిలో 60 ఎకరాల చొప్పున గుర్తించారు. అందులో మొక్కలు నాటేందుకు ఇటీవల అటవీశాఖ చదును చేసింది. దీనిని గమనించిన గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు.

ఆక్రమణలు గుర్తించాం - బాలామణి, జిల్లా అటవీ అధికారి

పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ఏటా మొక్కలు నాటుతున్నాం. మూడు నెలల ముందు నుంచే జిల్లా వ్యాప్తంగా అటవీ ఆక్రమణలను గుర్తించాం. గ్రామాల్లో పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆక్రమణలకు పాల్పడుతూ అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

గర్జనపల్లిలో గిరిజనులు అడ్డుకోవడంతో నాటని మొక్కలు 

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని