logo

కొలువు.. సాధనతో సులువు

కొలువు కొట్టాలంటే సాధన అవసరం.. పోలీసు కొలువు సాధించాలంటే అంత సులువేం కాదు. కఠోర సాధనతోనే సాధ్యం.. ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువుల కోసం గోదావరిఖనిలో నిరుద్యోగ యువతీ యువకులు శారీరక వ్యాయామం చేస్తూనే.. మరోవైపు

Updated : 24 Jun 2022 09:27 IST

శ్రమిస్తున్న యువతీ  యువకులు

న్యూస్‌టుడే, గోదావరిఖని

యువతులకు అవగాహన కల్పిస్తున్న శిక్షకుడు

కొలువు కొట్టాలంటే సాధన అవసరం.. పోలీసు కొలువు సాధించాలంటే అంత సులువేం కాదు. కఠోర సాధనతోనే సాధ్యం.. ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువుల కోసం గోదావరిఖనిలో నిరుద్యోగ యువతీ యువకులు శారీరక వ్యాయామం చేస్తూనే.. మరోవైపు రాత పరీక్షలో రాణించేందుకు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. అనుభవజ్ఞులైన శిక్షకుల దగ్గర శిక్షణ పొందుతున్నారు. గోదావరిఖనిలోని సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీడా మైదానంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 300 మంది వరకు కసరత్తు చేస్తున్నారు. విజయమ్మ ఫౌండేషన్‌తో పాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి భారీగా వస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు ఉదయం మూడు గంటల పాటు పరుగు, లాంగ్‌జంప్, షార్టుపుట్‌ ఈవెంట్‌లలో సాధన చేస్తున్నారు. పోలీసు శాఖ ఇచ్చిన పరీక్షల్లో నెగ్గేలా సాధన చేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా వారిని మరింత పదును పెట్టేందుకు యోగా కూడా చేయిస్తున్నారు. ఎక్కువ శాతం మంది నిరుద్యోగ యువకులు పట్టుదలతో సాధన చేస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి మైదానంలో శిక్షణ పొందుతున్నారు.

పోలీసుల సహకారం

నిరుద్యోగ యువతకు పోలీసు శాఖ నుంచి సహకారం అందిస్తున్నారు. పోలీసు శాఖ నుంచి ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రతి రోజు సాధన చేయిస్తున్నారు. పోలీసు ఈవెంట్‌లలో ఏ విధంగా అర్హత సాధించాలన్న విషయాలను అవగాహన కలిగించడంతో పాటు అందుకు అవసరమైన మెలకువలను నేర్పుతున్నారు. ఎత్తు, ఛాతి కొలతల్లోనూ అర్హత సాధించాల్సి ఉండటంతో దానికి అవసరమైన స్థాయిలో శారీరక సౌష్టవాన్ని పెంచుకోవాలని అవగాహన కలిగిస్తున్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలంటే అవసరమైన అన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మానసికంగానూ సిద్ధం చేస్తున్నారు. తక్కువ సమయంలో పరుగులో రాణించేలా సాధన చేస్తున్నారు. తొందరగా అలసిపోకుండా శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేలా వారిని తయారు చేస్తున్నారు.

సాధన చేస్తున్న యువతులు

ఉద్యోగ సాధనే లక్ష్యం - సాయిజితిన్, గోదావరిఖని

పోలీసు కొలువు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. ఐటీఐ పూర్తి చేశాను. సాంకేతిక ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. తప్పకుండా పోలీసు కొలువు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంకా రెండు నెలల సమయం ఉంది. అప్పటివరకు మరింత కష్టపడతాను. రాత పరీక్షల్లో రాణించేందుకు ముందుగా దృష్టి సారిస్తున్నాను. మరోవైపు భౌతిక పరీక్షల్లో ఎంపికయ్యేందుకు సాధన చేస్తున్నాను.

చాలా రోజుల తర్వాత అవకాశం - నవనీత్, గోదావరిఖని

చాలా రోజుల తర్వాత పోలీసు కొలువులకు నోటిఫికేషన్‌ పడింది. మళ్లీ అవకాశం వస్తుందో రాదో తెలియదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐటీఐ పూర్తి చేశాను. పెద్ద కొలువులకు అవకాశం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అవకాశం ఇప్పట్లో లేదు. అందుకే పోలీసు కొలువు సాధించాలన్న ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ అవకాశం మళ్లీ రాదు. సాధన విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదు.

రాత పరీక్షలో రాణించేందుకు సాధన - శ్రీనివాస్, గోదావరిఖని

ఉదయం శారీరకంగా శ్రమిస్తున్నాను. సాయంత్రం రాత పరీక్షకు అవసరమైన మెటీరియల్‌ చదువుతున్నాను. వర్తమాన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాను. రాత పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలు ఏవిధంగా ఉన్నాయన్న విషయాలపై చదువుతున్నాను. రాత పరీక్షకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. అందులో ఎంపికైతేనే భౌతిక పరీక్షలకు హాజరు కాగలం.

ముందే చేరుకునేలా శిక్షణ - రాజశేఖర్, శిబిరం శిక్షకులు

పోలీసు నియామకానికి ఇచ్చిన ఈవెంట్‌్్స టైం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేలా శిక్షణ ఇస్తున్నారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఈవెంట్స్‌ ఇచ్చారు. వాటికి ఇచ్చిన టైమింగ్‌ ప్రకారం చేరుకునేలా సాధన చేయిస్తున్నాం. నియామక ప్రక్రియకు ఇచ్చిన టైమింగ్‌ ముందు చేరుకునేలా అభ్యర్థులతో కసరత్తు చేయిస్తున్నాం.  పరుగుతో పాటు షార్టుపుట్, లాంగ్‌జంప్‌లలో కూడా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాధన చేయిస్తున్నాం. మానసికంగా అభ్యర్థులకు యోగా, ధ్యానం చేయిస్తున్నాం. ప్రధానంగా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నాం. 

గంగాధరలో యువతకు బాసటగా శిక్షణ కేంద్రం 

న్యూస్‌టుడే, గంగాధర 

ఉచిత శిక్షణకు హాజరైన యువత 

చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల నిరుద్యోగులు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 350 మంది యువతులు, 240 మంది యువకులు ఉచిత తరగతులకు హాజరవుతున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల, బోయినపల్లి మండలాలకు కేంద్రంగా ఉన్న కురిక్యాలలో ఓ ప్రైవేటు భవనం అద్దెకు తీసుకుని ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకు ఉద్యోగాలకు, పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల కోసం నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నారు. సబ్జెక్టుల వారీగా బోధిస్తూ విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేస్తున్నారు. 15 మంది అధ్యాపకులు 16 అంశాలపై బోధన చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజుల తరగతులు పూర్తవగా ఇంకా 70 రోజులపాటు ఇచ్చే శిక్షణలో భాగంగా వారానికోసారి పాఠ్యాంశాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిక్షణ కేంద్రం అధ్యాపకులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ అందించారు. ఇటీవల ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఉచిత తరగతులను పరిశీలించి నిర్వాహకులు, నిరుద్యోగ యువతను అభినందించారు. 

 దూరాభారమైనా వస్తున్నా - మల్లేశ్వరి, గుమ్లాపూర్‌ 

గతేడాది బీకాం పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన విడుదలతో ఆబ్కారీ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాలని సన్నద్ధమవుతున్న. మా ఊరు నుంచి ఇక్కడకు దూరమైనా స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నా. గణితం, జాగ్రఫీ, బయాలజీ, ఇతర అంశాలపై అధ్యాపకులు బోధిస్తుండటంతో ఎప్పటికప్పుడు నోట్స్‌ రాసుకుంటున్నాం. పాఠ్యాంశాలపై అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నాం. 

నిపుణులతో బోధన  - కరీం రాజు, అకాడమి డైరెక్టర్‌ 

హైదరాబాద్, తిరుపతి నుంచి 15 మంది నిపుణులైన అధ్యాపకులచే నిరుద్యోగులకు కోచింగు తరగతులు నిర్వహిస్తున్నాం. 100 రోజుల ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే రవిశంకర్‌ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. తెలంగాణ నేపథ్యం, చరిత్ర, అభివృద్ధి, పాఠ్యాంశాలు, ఇతర అంశాలపై బోధన చేస్తూ వాటిపై పరీక్షలు నిర్వహిస్తున్నాం.

ఉచితంగా పుస్తకాలు  - సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే 

నీళ్లు, నిధులు సాధించుకున్నట్లుగానే రాష్ట్రంలో ఉద్యోగనియామకాలకు సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు సాధించుకున్నాం. మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రకటన వెలువడటం శుభసూచకం. నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. పట్టణ కేంద్రాల్లోని కోచింగు కేంద్రాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించే స్థోమత లేనివారికి ఇక్కడ ఉచితంగా కోచింగు ఏర్పాటు చేశాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో నిరుద్యోగుల కల నెరవేర్చాలనే అనుభవం గల నిపుణులచే తరగతులు నిర్వహిస్తున్నాం. ఉచితంగా స్టడీ మెటీరియల్‌ కూడా అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని